విఘ్నేశ్వరుని గొలుసుతో మరో వివాదంలో రిహన్నా!

రైతుల నిరసనలకు మద్దతుగా ట్వీట్ చేసి విమర్శలను ఎదుర్కొన్న ఇంటర్నేషనల్ ఆర్ అండ్ బీ (రిథమ్ అండ్ బ్లూ) సింగర్ రిహన్నా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మంగళవారం ఆమె పోస్ట్ చేసిన టాప్‌లెస్ ఫొటో హిందువుల మనోభావాలను గాయపరుస్తోందని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రిహన్నా ఆ  ఫొటోలో, ఆమె టాప్‌లెస్‌గా కనిపించింది. ఆమె మెడలోని నెక్లెస్‌కు విఘ్నేశ్వరుని ప్రతిమ ఉంది. ఇది వజ్రాలు పొదిగిన ప్రతిమ. దీంతో చాలా మంది ఆమెను ప్రశ్నించారు. హిందువులను, హిందూ దేవతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. 

రిహన్నాకు భారత దేశంలో ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. అయినప్పటికీ విఘ్నేశ్వరుని ప్రతిమను ఈ విధంగా వాడటంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఓ ట్విటరాటీ స్పందిస్తూ, విఘ్నేశ్వరుడిని హిందువులు పూజిస్తారని, అలాంటపుడు గణేశుని ప్రతిమను నెక్లెస్‌లో పెట్టుకోవడం ఎందుకని ప్రశ్నించారు. 

మరొకరు దీనిపై విచారం వ్యక్తం చేస్తూ, కళాసౌందర్యం పేరుతో హిందూ మతాన్ని, సంస్కృతిని వాడుకోవడం మానుకోవాలని హితవు పలికారు. మరొక ట్విటరాటీ ఘాటుగా స్పందిస్తూ  ఈ విధంగా కేవలం హిందుత్వాన్నే ఎందుకు ఎగతాళి చేస్తున్నారని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను మాత్రమే ఎందుకు కించపరుస్తున్నారని నిలదీశారు. 

ప్రతి ఒక్కరూ వచ్చి తమ మతాన్ని ఎగతాళి చేస్తున్నారని, తాము మాత్రం హాయిగా కూర్చుని, సహిస్తూ ఉండాలా? అని ప్రశ్నించారు. రైతులకు మద్దతిస్తున్నావు కాబట్టి దానికి గుర్తుగా నిషాన్ సాహిబ్ పెండెంట్‌ను ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. 

రిహన్నా ఇటీవల రైతుల నిరసనలకు మద్దతు పలుకుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘మనం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు?! #ఫార్మర్స్‌ప్రొటెస్ట్’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. సచిన్ టెండూల్కర్, కంగన రనౌత్ వంటి ప్రముఖులు కూడా భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని ఆమెకు హితవు చెప్పారు.