ఫింగర్ ఫైవ్ వద్ద గుడారాలు ధ్వంసం చేస్తున్న చైనా 

భారత్-చైనా సరిహద్దుల వద్ద తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో సైన్యాలు వెనక్కి తగ్గుతున్నాయి. గతవారం కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఫింగర్స్ ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటోంది. ఈ క్రమంలోనే 2020 ఏప్రిల్‌లో ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను చైనా ధ్వంసం చేస్తోంది. 
 
తాజాగా ఫింగర్‌-5 వద్ద పాంగాంగ్‌ సరస్సులో నిర్మించిన జెట్టీని చైనా సైన్యం తొలగించింది. ఇప్పటివరకు ఫింగర్స్ వద్ద చైనా నిర్మించిన అతి పెద్ద నిర్మాణాల్లో ఇది కూడా ప్రధానమైనది. సరస్సుల్లోని పడవలో బలగాలు దిగటానికి వీలుగా దీనిని నిర్మించింది. దీంతోపాటు సమీపంలోని హెలిప్యాడ్‌ను కూడా డ్రాగన్ సైన్యం ధ్వంసం చేసింది. 
 
ఇక ఫింగర్ 5 వద్దనే కాకుండా ఫింగర్‌-4 వద్ద నిర్మించిన తాత్కాలిక క్యాంపు గుడారాలను కూడా తొలగిస్తున్నారు. బెల్జియంకు చెందిన ఓ సైనిక విశ్లేషణ సంస్థ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది. చైనాతో పాటు భారత్‌ కూడా సైనిక ఉపసంహరణలను కొనసాగిస్తోంది. సరస్సు దక్షిణ ఒడ్డున కీలక శిఖరాలపై నుంచి తమ బలగాలను ఉపసంహరిస్తోంది.
మరికొన్ని రోజుల్లో ఫింగర్‌ -3 వద్ద  భారత ఐటీబీపీకి  చెందిన ధాన్‌సింగ్‌ థాపా పోస్టు వద్దకు మన బలగాలు చేరుకోనున్నాయి. ఇప్పటికే సాయుధ వాహనాలను ఇరువర్గాలు వెనక్కి పిలిపించిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఫిబ్రవరి 20వ తేదీ వరకు సమయం పడుతుందని భావిస్తున్నారు.
బలగాల ఉపసంహరణను డ్రోన్లు, ఉపగ్రహాల సాయంతో ఇరు దేశాలూ పర్యవేక్షిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతాల్లో కూడా బలగాల ఉపసంహరణ కోసం త్వరలో కోర్ కమాండర్ల మీటింగ్ జరగనుంది. దీనికి ముందు ప్యాంగాంగ్ సరస్సు పరిస్థితిపై మరో సారి రివ్యూ మిటింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో ఉన్న ‘ఫింగర్‌4’  భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. ఇక్కడి నుంచి చూస్తే భారత్‌‌కు చెందిన బోట్లు నిలిపే లుకుంగ్‌ ప్రాంతం చైనాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ 190 వరకు శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను డ్రాగన్ ఆర్మీ నిర్మించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. వీటిని కూడా తొలగించే పనిలో చైనా ఉన్నట్లు తెలుస్తోంది.