పర్యాటక రాజధానిగా మారనున్న అయోధ్య 

రామ జన్మభూమిలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించే ప్రక్రియతో ఈ ప్రాంతాన్ని ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తయారుచేసేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అయోధ్యను పర్యాటక రాజధానిగా మార్చడానికి కావాల్సిన నిధులను విడుదల చేస్తూ చకచకా పనులు చేయిస్తున్నది. 

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అయోధ్యలోనే వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శితో పాటు పనిచేస్తున్న సంస్థల చీఫ్ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వివరంగా చర్చించారు. సరయూ నదిపై బ్యారేజీ, రబ్బరు ఆనకట్ట నిర్మాణాలతో రామ జన్మభూమి ప్రాంతం యొక్క చిత్రం పూర్తి మారిపోనున్నది. 

ప్రాజెక్ట్ యొక్క బ్యారేజ్ సైట్ సర్వేయింగ్, స్టడీ వర్క్, హైడ్రోలాజికల్ స్టడీ పనులు ఇప్పటికే పూర్తి చేశారు.  ఈ సందర్భంగా పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. రూ.155 కోట్లతో నయా ఘాట్ బంధ తిరాహా నుంచి బిల్వాహరి ఘాట్ వరకు సరయూ నదిపై 13.50 కిలోమీటర్ల పొడవైన కట్టను నిర్మించనున్నారు.

గుప్తర్‌ ఘాట్ నుంచి రాజ్‌ ఘాట్ వరకు రూ.236.56 కోట్లతో బంధను నిర్మించి బలోపేతం చేయనున్నారు. పంచకోసి పరిక్రమ మార్గ్ వెడల్పు, సుందరీకరణకు రూ.504 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే, రూ.708 కోట్లతో సరయూలోని మజా జమ్తారా ప్రాంతంలో సీతా సరస్సు నిర్మాణం పనులు చేపట్టనున్నారు.

రూ.55 కోట్ల నిధులతో విద్యాకుండ్ నుంచి భరత్‌కుండ్ వరకు 16.50 కిలోమీటర్ల పొడవైన మార్గం నిర్మించనున్నారు. రూ.25 కోట్లతో భరత్‌కుండ్ సుందరీకరణకు కేటాయించారు. పురాణ పర్యాటక ప్రాంతం సూర్యకుండ్‌ సుందరీకరణకు రూ.24 కోట్లు కేటాయించారు. రామ్‌నగర్‌ను కలిపే అన్ని ప్రధాన మార్గాల్లో బస్ స్టాండ్, పార్కింగ్, టాయిలెట్, మార్కెట్‌లను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.

దేశంలోని ప్రతి దిశ నుంచి అయోధ్య వచ్చే సందర్శకులను గ్రాండ్ ఎంట్రన్స్ స్వాగతిస్తుంది. ఇదిలావుండగా, ఎనిమిదేండ్ల క్రితం బాంధ తిరాహాలో నిర్మాణంలో ఉన్న రామ్‌ద్వార్‌ను తొలగించే ప్రతిపాదనకు కూడా ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. ఈ ప్రణాళికలను త్వరలో అమలు చేయనున్నట్లు ఎమ్మెల్యే వేద్‌ప్రకాష్‌ గుప్తా తెలిపారు.

ఇందుకోసం ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయి నుంచి పర్యవేక్షణ జరుగుతున్నదని, కొద్ది నెలల్లోనే పర్యాటకానికి ప్రపంచ రాజధానిగా అయోధ్య తయారవడం ఖాయమని వేద్‌ప్రకాష్‌ గుప్తా పేర్కొన్నారు.