అస్త్రా మార్క్ 2 క్షిప‌ణితో  గ‌గ‌నశ‌క్తిలో భార‌త్ పైచేయి   

భారత్ త్వరలో చేపట్టనున్న అస్త్రా మార్క్ 2 క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో   చైనా, పాక్ దేశాలతో పోలిస్తే గ‌గ‌నశ‌క్తిలో భార‌త్ పైచేయి సాధించ‌నున్న‌ది.  గ‌గ‌న‌త‌లం నుంచి గ‌గ‌న‌తలంలో ఉన్న టార్గెట్ల‌ను అస్త్రా మార్క్ 2 చేధించ‌గ‌ల‌దు.  ఈ మిస్సైల్ రేంజ్ 160 కిలోమీట‌ర్లు.  అయితే అద‌న‌పు రేంజ్‌లో అస్త్రా మార్క్ 2 క్షిప‌ణిని ప‌రీక్షించ‌నున్నారు.

ప్రస్తుతమున్న అస్త్ర క్షిపణి 100 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించే గలదు. అయితే ఈ సామర్థ్యాన్ని 160 కిలోమీటర్లకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే భారత్ ఫైటర్ జెట్లు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రుదేశ విమానాలు తుత్తునీయలు చేయగలవు.

తేలికపాటి యుద్ధ విమానం తేజెస్‌ నుంచి దీన్ని ప్రయోగించేందుకు వీలుగా ఈ క్షిపణిని అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం భారత వినియోగిస్తున్న రష్యా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ క్షిపణులకు బదులుగా ఆస్త్ర మార్క్-2 వియోగించేందుకు వీలుగా రక్షణశాఖ వర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

‘ఇందుకు సంబంధించిన క్షిపణి పరీక్షలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది చివరికల్లా వీటిని పూర్తి చేయాలని యోచిస్తున్నాం. గగనతల యుద్ధాల్లో చైనా, పాక్‌లపై పైచేయి సాధించేందుకు అస్త్ర మార్క్-2 ఎంతో ఉపయోగపడుతుంది. 2022 నాటి కల్లా ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాగలదని ఆశిస్తున్నాం’ అని రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. 

ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్‌గా అస్త్రాను తీర్చిదిద్దుతున్నారు.  ధ్వ‌ని వేగం క‌న్నా నాలుగింత‌లు వేగంతో ఈ క్షిప‌ణి ప్ర‌యాణిస్తుంది.  స్వ‌దేశంలో త‌యారైన తేజ‌స్ యుద్ధ‌విమానాల్లో ఈ మిస్సైళ్ల‌ను పొందుప‌రుచాల‌ని భావిస్తున్నారు.  అన్ని ర‌కాల వాతావ‌ర‌ణాల్లో, ప‌గ‌లూ-రాత్రి పూట అస్త్రా ఆయుధం ప‌నిచేస్తుంది. భార‌త వాయుసేన‌తో పాటు భార‌త నౌకాద‌ళం మొత్తం 280 అస్త్రా మార్క్‌-1 మిస్సైళ్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చింది.

కాగా..భారత్ ప్రస్తుతం రష్యా, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ తయారు చేసిన బియాండ్ విజువల్ రేంజ్ మిస్సైళ్లను (37 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోని లక్ష్యాలు ఛేధించగలిగే క్షిపణులు) దిగుమతి చేసుకుని ఫైటర్ విమానాలకు అమర్చుతోంది. వీటిని గాల్లోనే వీటిని నిర్వీర్యం చేసేందుకు శత్రుదేశ విమానాలు ప్రయోగించే వ్యూహాలన్నిటికీ చెక్ పెట్టగలిగేలా ఈ క్షిపణుల్లో కౌంటర్ మెషర్స్ ఉంటాయి. ఆస్త్రాకు కూడా ఇటువంటి విశిష్ట సామర్థ్యం ఉందని భారత రక్షణ పరిశోధన అభివృధ్ది సంస్థ పేర్కొంది.