విశాఖ ఉక్కు ప్రైవేట్ పరంపై పునరాలోచించండి 

విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేట్ పరం చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ బిజెపి నేతలు  కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కి విజ్ఞప్తి చేశారు.  బిజెపి ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి డి పురందేశ్వరి, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్యెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్యెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజులు కేంద్ర మంత్రిని కలసి ఈ విషయమై వినతి పత్రం సమర్పించారు. 
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని రాజకీయ పక్షాలు గత కొద్దిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు కేంద్రమంత్రిని కలిసి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆంధ్రులు వ్యతిరేకిస్తున్నారని, ప్రజల మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరముందని కేంద్రమంత్రికి తెలిపినట్లు సోమువీర్రాజు తర్వాత మీడియాకు తెలిపారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ అంశాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
 
గతంలో బ్యాంకులను నష్టాల బారినుండి గట్టెంక్కించేందుకు విలీనం చేసిన విధంగా …. స్టీల్ ప్లాంట్ ను విషయంలో విలీన ప్రతిపాదనలను కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా,బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ముఖ్యనేతలను కలిసి ఉక్కు కర్మాగారం విషయంలో ఉన్న మనోభావాలను వివరిస్తామని ఆయన తెలిపారు.

పురందేశ్వరి మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పలు ప్రత్యామ్నాయాలు సూచించామని చెప్పారు. సెయిల్‌, ఎన్‌ఎండీసీలో విలీన ప్రతిపాదనలు చేశామని తెలి
పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉక్కు కర్మాగారం ఉద్యోగుల శ్రేయస్సును పరిరక్షించాలని కేంద్రమంత్రిని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు.

నష్టాల భర్తీ కోసం ఐపీవో ద్వారా నిధుల సేకరణ చేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే హామీ లేని రుణాల సేకరణ కోసం ప్రభుత్వ బాండ్లు జారీ చేయాలని సూచించినట్టు పురందేశ్వరి చె ప్పారు. ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారని ఆమె చెప్పా రు. అలాగే మూడు దశాబ్దాల క్రితం కేవలం రూ.4,950కోట్ల పెట్టుబడితో మొదలైన ఈ ప్లాంటు విలువ ఇపుడు రూ.43,099 కోట్లకు పెరిగిందని, దీనివల్ల ఏపీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.8565 కోట్లు ఆదాయం సమకూరుతోందని వినతి పత్రంలో మంత్రికి వివరించామని తెలిపారు.