మార్చి 28 నుంచి కర్నూలు నుంచి విమాన సర్వీసులు 

మార్చ్ 28 నుంచి కర్నూలు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇండిగో సంస్థ సోమవారం నుంచి బుకింగ్స్‌ ప్రారంభించింది. ఓర్వకల్లు విమానాశ్రయ పనులు పూర్తి కావడంతో ఆ సంస్థ విమానాలు నడిపేందుకు చర్యలు చేపట్టింది. 28న విశాఖపట్నానికి తొలి విమానం నడపనుంది. అదే రోజు బెంగళూరు, చెన్నైలకు సర్వీసులు ప్రారంభంకానున్నాయి.

పనులు పూర్తి కావడంతో డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అధికారులు కర్నూలు విమానాశ్రయానికి అన్నీ అనుమతులు మంజూరు చేశారు. విమానం బెంగుళూరులో 9.05 గంటలకు బయల్దేరి కర్నూలు 10.10కు, తిరిగి కర్నూలులో 10.30 గంటలకు బయల్దేరి విశాఖపట్నం 12.40కు చేరుకుంటుంది.

విశాఖపట్నంలో 13.00 గంటలకు బయల్దేరి కర్నూలు 14.55కు, కర్నూలులో 15.15 గంటలకు బయల్దేరి బెంగుళూరు 16.25కు, చెన్నైలో 14.50 గంటలకు బయల్దేరి కర్నూలు 16.10కు, కర్నూలులో 16.30 గంటలకు బయల్దేరి చెన్నై 17.50కు చేరుకుంటుందని ఇండిగో అధికారులు పేర్కొన్నారు.