‘వాక్‌ స్వాతంత్య్ర హక్కు’కు పరిమితులు తేలుస్తాం!

వాక్‌ స్వేచ్ఛకు పరిమితులేమిటో తేలుస్తామని ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్  స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు సహాయకుడి (అమికస్‌ క్యూరీ)గా సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాంను నియమించింది. ‘‘వాక్‌ స్వాతంత్య్ర హక్కుకు పరిమితులు లేవా? ఈ స్వేచ్ఛ ఎక్కడ ఆరంభం అవుతుంది? ఎక్కడ అంతం అవుతుంది?’ అనే విషయాన్ని తేలుస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది.

మీడియాతో మాట్లాడకుండా ఎన్నికల కమిషన్‌ పలువురు నేతలపై ఆంక్షలు విధించడం… ‘మా వాక్‌ స్వాతంత్య్ర హక్కు దెబ్బతింటోంది’ అంటూ వారు హైకోర్టును ఆశ్రయిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై మంత్రి కొడాలి నాని దూషణల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకొంది.

ఎస్‌ఈసీపై అభ్యంతరకర వ్యాఖ్యలు-ఆంక్షలకు సంబంధించి వారంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎమ్మెల్యే జోగి రమేశ్‌, మంత్రి కొడాలి నాని హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారని గుర్తు చేసింది. మీడియా సమావేశంలో ఎస్‌ఈసీని లక్ష్యంగా మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వీడియో టేపులను న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు సోమవారం కోర్టు హాలు లో స్వయంగా వీక్షించారు.  విచారణను బుధవారానికి వాయిదా వేశారు. 

అంతకుముందు ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపిస్తూ… ‘‘మంత్రి కొడాలి నాని కోడ్‌ అమల్లోకి రాకముందు  తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ఎస్‌ఈసీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎస్‌ఈసీ ప్రతిష్ఠను దిగజార్చేలా మంత్రి వ్యాఖ్యలు చేశారు. పరుష పదజాలంలో దాడి చేశారు. ఇలాంటివి అడ్డుకోకపోతే వ్యవస్థల ప్రతిష్ఠలు దిగజారతాయి’’ అని తెలిపారు. 

మరోవంక, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో మాట్లాడవద్దని, ఓటర్లను ప్రభావితం చేసే వ్యాఖ్యలు చేయవద్దని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌ను ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 21వరకు పొడిగించింది. న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవచ్చని ఎస్‌ఈసీకి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు జస్టిస్‌  డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు సోమవారం ఆదేశాలిచ్చారు.