గోవు విజ్ఞానంపై ఆన్‌లైన్ పరీక్షలకు ప్రోత్సహించండి 

గోవు విజ్ఞానంపై (ఆవు శాస్త్రం) తమ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి విద్యార్థులు ఆన్‌లైన్ స్వచ్ఛంద జాతీయ స్థాయి పరీక్షలో పాల్గొనేలా వారిని ప్రోత్సహించాలని దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) బుధవారం కోరింది. 
 
కామధేను గో విజ్ఞాన్ ప్రచార్-ప్రసార్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 25న జరగనున్నది. పరీక్ష రాసేందుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. రాష్ట్రీయ కామధేను ఆయోగ్(ఆర్‌కెఎ) నిర్వహిస్తున్న ఈ పరీక్షలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలతోపాటు కళాశాల విద్యార్థులు కూడా పాల్గొనవచ్చు. 
 
11 ప్రాంతీయ భాషలు, ఇంగ్లీషులో ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్‌తో కూడిన పరీక్షలో సామాన్య ప్రజలు సైతం పాల్గొనవచ్చు. గంటసేపు ఈ పరీక్ష ఉంటుంది. గో పరిరక్షణ, వాటి సంతతి అభివృద్ధి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఆర్‌కెఎని స్థాపించింది. 
 
ఆవు పాలు ఇవ్వడం ఆపేసినప్పటికీ ఆవు వల్ల లభించే వ్యాపార అవకాశాలు, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను భారతీయులందరికీ అవగాహన కల్పించడమే ఫిబ్రవరి 25న నిర్వహించే పరీక్ష లక్షమని ఆర్‌కెఎ జనవరి 5న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, ఈ పరీక్షలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతూ యుజిసి కార్యదర్శి రజనీష్ జైన్ వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లకు లేఖ రాశారు.
భారత్‌, రష్యాల్లోని అణు కేంద్రాల్లో రేడియేషన్‌ను నివారించేందుకు, రక్షణకు ఆవు పేడను వినియోగిస్తారని, భోపాల్‌ గ్యాస్‌లీక్‌ ఘటన నుండి స్థానికులు ఆవు పేడ ద్వారా రక్షించబడ్డారనే అంశాలను ఈ పరీక్షలకు ఉద్దేశించిన స్టడీ మెటీరియల్‌లో పేర్కొంది. స్వదేశీ ఆవు ఆర్థిక, శాస్త్రీయ, పర్యావరణ, ఆరోగ్యం, వ్యవసాయ, ఆధ్యాత్మిక చింతనలపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పశుసంవర్థక శాఖ కింద ఏర్పాటు చేసిన రాష్ట్రీయ కామథేను ఆయోగ్‌ (ఆర్‌కెఎ)… ఈ పరీక్షను నిర్వహిస్తోందని యుజిసి ఫిబ్రవరి 12న రాసిన లేఖలో పేర్కొంది.