ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు భారత్ వ్యాక్సిన్ 

ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు రెండు లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్లు బహుమతిగా ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు జీఎవిఐ తదితర అంతర్జాతీయ సంస్థల్లో చురుగ్గా ఉంటోన్న భారత్ శాంతి బలగాల సేవలను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు.

క్యరాజ్యసమితి భద్రతామండలి ఓపెన్ డిబేట్‌ సందర్భంగా జై శంకర్ ఆ ప్రకటన చేశారు. సార్క్ కోవిడ్-19 ఎమర్సెన్సీ ఫండ్‌ కోసం భారత్ గట్టిగా మద్దతిచ్చిన విషయాన్ని జై శంకర్ గుర్తు చేశారు. భారత్ ఇప్పటికే 25 దేశాలకు మేడిన్ ఇండియా కోవిడ్ వ్యాక్సిన్లు పంపిందని చెప్పారు. మరో 49 దేశాలకు పంపేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. 

మరోవంక, దేశంలోని సాధారణ ప్రజలకు కరోనా టీకా ఈ ఏడాది చివరినాటికి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులెరియా కరోనా టీకా విషయమై మాట్లాడుతూ ఈఏడాది చివరి నాటికి భారతీయ మార్కెట్‌లోకి కరోనా టీకా రానున్నదని, దానిని ఎవరైనాసరే కొనుగోలు చేసి వేయించుకోవచ్చని వెల్లడించారు.

ఇంతకు ముందు పూణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదర్ పూనావాలా  మార్చి, ఏప్రిల్ నాటికి మార్కెట్‌లోకి కరోనా టీకా అందుబాటులోకి రానున్నదని పేర్కొన్నారు. ఇదేవిధంగా జూన్, జూలై నాటికి ప్రజలకు మార్కెట్‌లో కరోనాటీకా లభిస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకె పాల్ అభిప్రాయపడ్డారు.

కాగా డాక్టర్ గులెరియా కరోనా టీకా రెండవ డోస్ తీసుకున్న అనంతరం  కరోనా టీకాలు వేసే విషయంలో ప్రభుత్వ లక్ష్యం పూర్తయ్యాక ఈ టీకా మార్కెట్‌లోకి 2021 చివరినాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం ముందుగా దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. నిలో భాగంగా మొదటిదశ వ్యాక్సినేషన్ జనవరి 16 నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలోని 90 లక్షల మందికి టీకాలు వేయడానికి 30 రోజుల సమయం పట్టనుంది. దీని ప్రకారం 30 కోట్ల మందికి టీకాలు వేయడానికి ఒక ఏడాది సమయం పట్టనుంది.

కాగా, దేశంలో 11,610 కరోనా కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1.09 కోట్లు దాటింది. వీటిలో క్రియాశీల(యాక్టివ్‌) కేసులు ప్రస్తుతం 1.36 లక్షలే ఉండగా, 1.06 కోట్లమంది కోలుకున్నారు. తాజాగా మరో 100 మంది కరోనాతో మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1.56 లక్షలకు చేరువైంది.

 గత 24 గంటల్లో మృతిచెందిన వంద మందిలో సగం మందికిపైగా మహారాష్ట్ర (39), కేరళ (18), తమిళనాడు(7) రాష్ట్రాలవారే. అయితే ఆంధ్రప్రదేశ్‌ సహా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్‌ కొత్త మరణాలు సంభవించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.   ముంబై పోలీసులు మాస్క్‌ ధరించని 15 లక్షల మంది నుంచి రూ.200 చొప్పున రూ.30 కోట్ల జరిమానా  వసూలు చేశారు.

ఇలా ఉండగా, భారత్‌ ఆమోదించిన రెండు వ్యాక్సిన్లకు దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ట్రెయిన్లపై ప్రభావం చూపేటంతటి సామర్ధ్యం ఉందని చెప్పలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకే స్ట్రెయిన్‌పై మాత్రం ఇవి ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మంగళవారం దేశంలో తొలిసారిగా ఒక బ్రెజిల్‌ స్ట్రెయిన్‌ కేసు, నాలుగు దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

అలాగే, యూకే స్ట్రెయిన్‌ కేసుల సంఖ్య 187కు చేరుకుందని తెలిపింది. దీనిపై స్పందించిన శాస్త్రవేత్తలు.. దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ స్ట్రెయిన్లపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌కు మాత్రమే కొత్త స్ట్రెయిన్లపై అంతో ఇంతో ప్రభావం చూపే సామర్ధ్యం ఉందని తెలిపారు.