15 దేశాల్లో కీలక పదవులలో 200 మంది ప్రవాస భారతీయులు   

200 మందికి పైగా భారత సంతతికి చెందిన వారు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లతో సహా 15 దేశాలలో కీలకమైన నాయకత్వ స్థానాల్లో ఉన్నారని అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఒకటి ఒక జాబితాను విడుదల చేసింది. వారిలో 60 మందికి పైగా కాబినెట్ హోదాలలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ కమలా హారిస్‌ భారతీయ సంతతకి చెందినవారు కావడం గర్వకారణమని పేర్కొంది.
ప్రజా సేవలో ఉన్న డయాస్పొరాకు చెందిన వీరిని ప్రముఖంగా ప్రకటించేందుకు అధ్యక్ష దినోత్సవం రోజున ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నామని సిలికాన్‌ వ్యాలీకి చెందిన బిజినెస్‌మెన్‌, ఇండియాస్పొరా వ్యవస్థాపకుడు ఎం.ఆర్‌. రంగస్వామి తెలిపారు. ఈ నేతలు భవిష్యత్‌ తరాలకు మంచి వారసత్వాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రవాస భారతీయ కమ్యూనిటీని మించి వారు విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాలు, సంఘాలకు ఇది విస్తరించిందని అన్నారు. ప్రవాస భారతీయులు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సింగపూర్‌, కెనడా, యుఎఇ, బ్రిటన్‌ వంటి దేశాల్లో దౌత్యవేత్తలు, శాసనసభ్యులు, సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతులు, సీనియర్‌ సివిల్‌ సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్నారు.
2021 ఇండియాస్పొరా ప్రభుత్వనేతల జాబితాలో చేర్చడం గౌరవంగా ఉందని, బారతీయ అమెరికన్‌ సమాజంలో అంతర్భాగంగా మారినందుకు తాను గర్వపడుతున్నాని.. అమెరికా విదేశీ వ్యవహారాల చైర్మన్‌, కాంగ్రెస్‌ సభ్యులు అమీబెరా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 32 మిలియన్లకు పైగా భారతీయ సంతతికి చెందినవారు (పిఐఒ) ఉన్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోనే భారతీయలు అతిపెద్ద ప్రవాసుల జనాభా అని తెలిపింది.

2021 ఇండియాస్పొరా ప్రభుత్వ నేతల జాబితాలోని అధికారులు సమిష్టిగా 587 మిలియన్లకు పైగా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆయా దేశాల జిడిపిలో 28 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ప్రభావం చూపుతున్నారని ఇండియాస్పొరా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రవాస భారతీయుల నేతలు.. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజాలను ముందుకు తీసుకువెళ్లేందుకు చేస్తున్న విశేషమైన కృషి స్ఫూర్తిదాయకమని పీజీ విద్యా, వారసత్వ, కళల మంత్రి రోజీ అక్బర్‌ సంతోషం వ్యక్తం చేశారు.