దేశచ‌రిత్ర ప్ర‌జ‌ల జాన‌ప‌దాల్లో దాగి ఉంది

దేశ చ‌రిత్ర అనేది దేశానికి బానిసత్వం నుంచి విముక్తి క‌ల్పించిన వారి ర‌చ‌న‌ల్లో, బానిస మ‌స్త‌త్వం కలిగిన వారి మాట‌ల్లో మాత్ర‌మే లేద‌ని, సాధార‌ణ ప్రజ‌ల జాన‌ప‌ద పాట‌లు, క‌థ‌ల్లోనూ దేశ చ‌రిత్ర‌ దాగి ఉన్న‌ద‌ని ప్ర‌ధాని  నరేంద్రమోదీ చెప్పారు. జాన‌ప‌దాల ద్వారానే దేశ చ‌రిత్ర త‌ర‌త‌రాలకు అందించ‌బ‌డుతున్న‌ద‌ని ఆయ‌న తెలిపారు. 
 
దేశ ప్ర‌జ‌ల‌కు వ‌సంత పంచ‌మి శుభాకాంక్ష‌లుతెలుపుతూ ఈ వ‌సంత పంచ‌మి దేశంలో కొత్త ఆశ‌ల‌ను చిగురింపజేయాల‌ని, కొత్త ఉత్సాహాల‌ను నింపాల‌ని, క‌రోనా మ‌హ‌మ్మారి బాప‌తు ఆప‌ద‌ల‌ను పూర్తిగా తొల‌గిపోవాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. 
 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మ‌హారాజా సుహెల్దేవ్ మెమోరియ‌ల్‌కు, చిత్తౌరా లేక్ అభివృద్ధి ప‌నుల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా శంకుస్థాప‌న చేసిన అనంత‌రం ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. సుహేల్దేవ్  పేరుతో బరైచ్ లో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను కూడా ప్రారంభించారు. 
దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 ఏండ్లు కావ‌స్తున్నా మ‌హారాజా సుహెల్‌దేవ్ లాంటి యోధుల త్యాగాల‌ను, పోరాట ప‌టిమ‌ను, ప‌రాక్ర‌మాన్ని, అమ‌ర‌త్వాన్ని భావిత‌రాల‌కు చాటిచెప్పే పెద్ద కార్య‌క్ర‌మాలు ఏవి జ‌రుగ‌డం లేద‌ని విచారం వ్యక్తం చేశారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి చ‌రిత్ర‌లో స‌ముచిత స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డం మ‌న దౌర్భాగ్య‌మ‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. చ‌‌రిత్ర సృష్టించిన నిజ‌మైన యోధుల‌కు చ‌రిత్రకారులు అన్యాయం చేశార‌ని, చేయాల్సినంత మోసం చేశార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తంచేశారు. అయితే, ఆ వ‌క్రీక‌రించిన చ‌రిత్ర‌న ప్ర‌స్తుత భార‌త‌దేశం స‌రిచేస్తున్న‌ద‌ని ప్ర‌ధాని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చూపిన చొరవను, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింప చేయడంలో చూపిస్తున్న శ్రద్ధను ప్రధాని కొనియాడారు.