రాహుల్ రాకకు ముందే మైనారిటీలో పుదుచ్చేరి ప్రభుత్వం

పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఇక్కడ మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తల్ని సిద్దం చేయడానికి ఆయన ఈ పర్యటనకు పూనుకున్నారు. 
 
ఆయన రాష్ట్రానికి రావడానికి ఒకరోజు ముందు అంటే మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జాన్ కుమార్ తన రాజీనామాను ప్రకటించారు. దాంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అక్కడి అసెంబ్లీలో ఉన్న మొత్తం 30 మంది ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మ్యాజిక్ ఫిగర్ రావడానికి కనీసం 16 మంది ఉండాలి. దాంతో వారు డీఎంకేకు చెందిన ఇద్దరు సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.  
ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో.. కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 11కి పడిపోయింది. నమశివాయం, తీప్పయింజన్‌ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న రాజీనామా చేయగా.. మిగితా ఇద్దరిలో ఒకరు సోమవారం, మరొకరు మంగళవారం తమ రాజీనామాలు సమర్పించారు.
దాంతో నారాయణస్వామి ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. ఈ తరుణంలో సీఎం నారాయణస్వామి వెంటనే కేబినేట్ మీటింగ్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.