దేశంలో అస్థిరత సృష్టించే శక్తులకు కేంద్రంగా ఢిల్లీ 

దేశంలో అస్థిరత సృష్టించడం కోసం చాలా దేశ వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని, వారి కార్యకలాపాలకు ఢిల్లీ కేంద్రంగా నెలకొన్నదని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. గత ఏడాది ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో జరిగిన అల్లర్లు, ఇటీవల రిపబ్లిక్ డే రోజున జరిగిన హింస, విధ్వంసములు రెండు ఒక భారీ కుట్రలో భాగమని స్పష్టం చేశారు. 
 
ఢిల్లీ పోలీస్ 74వ రైజింగ్ డే కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొంటూ ఈ రెండు సందర్భాలలో శాంతిభద్రతల పరిరక్షణకు ఢిల్లీ పోలీసులు చేసిన కృషిని కొనియాడారు. ఫిబ్రవరి, 2020లో జరిగిన అల్లర్లు, అక్రమ నిరసనలు ఈ కుట్రలో భాగమని పేర్కొంటూ వాటిని ఎదుర్కోవడంలో ఢిల్లీ పోలీసులు  చూపిన చొరవ దేశంలోని ఇతర ప్రాంతాల పోలీసులకు మార్గదర్శకం కాగలవని చెప్పారు. 
జనవరి 26న దేశ వ్యతిరేక శక్తులు రైతుల ఉద్యమంలో చేరి ఢిల్లీలో శాంతిభద్రతలను భగ్నం కావించడం కోసం ప్రయత్నం చేసారని తెలిపారు. వారి దేశ వ్యతిరేక కార్యకలాపాలు, రెచ్చగొట్టే ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు చాలా సంయమనంతో ఎదుర్కొని  బాధ్యతాయుతంగా వ్యవహరించారని కిషన్ రెడ్డి ప్రశంసించారు. 
 
ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి తాము ఆధునిక సాంకేతికతను, అందుబాటులో ఉన్న సాక్ష్యాలను ఉపయోగించి నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపామని ఢిల్లీ పోలీస్ కమీషనర్ ఎస్ ఎన్ శ్రీవాత్సవ్ చెప్పారు. ఒక పోలీస్ మృతి చెంది, మరి అనేకమంది గాయాలకు గురయ్యారని తెలిపారు. అయితే తాము ఎటువంటి మతపరమైన వివక్షత చూపకుండా మొత్తం 755 కేసులను నమోదు చేశామని, మొత్తం సుమారు 1800 మందిని అరెస్ట్ చేశామని వివరించారు. 
 
కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఢిల్లీ పోలీసులు ప్రశంసనీయంగా పనిచేశారని, `దిల్ కి పోలీస్’ అనే పేరు తెచ్చుకున్నారని, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా ప్రత్యేకంగా తమను అభినందించారని ఆయన చెప్పారు. కరోనాతో తాము 34 పోలీసులను కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు.