ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ఓ మహిళపై అత్యాచారం!

ఆస్ట్రేలియా  పార్టమెంట్‌లోని రక్షణమంత్రిత్వ శాఖ కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ ఆరోపించడం ఆ దేశంలో పెను దుమారం రేపింది. ఈ దారుణాన్ని తొక్కిపెట్టేందుకు పై అధికారులు ప్రయత్నించారని, ఫిర్యాదు చేయవద్దంటూ తనపై ఒత్తిడి తెచ్చారని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన కలకలం రేపుతుండటంతో  ప్రధాని స్కాట్ మారిసన్ స్వయంగా బాధితురాలికి క్షమాపణలు చెప్పారు.
ఈ విషయంలో లోతైన దర్యాప్తు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. 2019లో ఈ దారుణం జరిగినట్టు బాధితురాలు ఆరోపించారు. రక్షణశాఖ మంత్రి లిండా రేనాల్డ్స్ కార్యాలయంలో ప్రధాని నేతృత్వంలోని అధికారికి లిబరల్ పార్టీకి చెందిన తన సహోద్యోగి ఒకరు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు ఆమె ఆరోపించారు.
వారందరూ ఓ రోజు రాత్రి పార్టీ చేసుకున్న సందర్భంగా ఈ దారుణం జరిగిందన చెప్పారు. తదనంతరం..తాను పోలీసులను ఆశ్రయించానని, కానీ తన కేరీర్‌పై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుందనే భయంతో మిన్నకుండిపోయానని ఆమె పేర్కొన్నారు. కాగా.. పోలీసులు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తమ దృష్టికి తెచ్చినట్టు వారు అంగీకరించారు. ఈ ఘటన గురించి లిండా కార్యలయంలోని సినియర్ సిబ్బంది దృష్టికి కూడా తెచ్చానని బాధితురాలు తెలిపారు.
 ఆ తరువాత.. అత్యాచారం జరిగిన కార్యాలయంలోనే ఓ సమావేశానికి హాజరు కావాలంటూ కార్యాలయ ఉన్నతాధికారులు తనను కోరినట్టు ఆమె పేర్కొన్నారు. ఇక రక్షణ మంత్రి లిండా కూడా తనకు ఫిర్యాదు అందిన విషయాన్ని సోమవారం అంగీకరించారు. ఫిర్యాదు చేయకుండా మహిళపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.
ఇది పెను వివాదంగా మారుతుండటంతో మంగళవారం ఏకంగా దేశ ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. ‘ఈ దారుణం జరిగుండాల్సింది కాదు. నేను క్షమాపణలు చెబుతున్నా. ఇక్కడ పనిచేస్తున్న వారందరికీ పూర్తి భద్రత కల్పించే బాధత మాది’ అని ఆయన స్పష్టం చేశారు.