టూల్ కిట్ కేసులో మరో ఇద్ద‌రికి వారెంట్

టూల్ కిట్ కేసులో ఇవాళ ఢిల్లీ పోలీసులు మరో ఇద్ద‌రికి నాన్‌బెయిల‌బుల్ వారెంట్ జారీ చేశారు.  నికితా జాక‌బ్‌, షంత‌న్‌ల‌పై ఆ వారెంట్లు జారీ అయ్యాయి.  ఆ ఇద్ద‌రూ టూల్ కిట్ వివాదంలో ఉన్న‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. టూల్ కిట్ అంటే సోష‌ల్ మీడియాలో ఓ డాక్యుమెంట్‌.  అంత‌ర్జాతీయ ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ గ్రెటా థ‌న్‌బ‌ర్గ్ ఈ టూల్‌కిట్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపింది. 
 
ఆ టూల్ కిట్‌ను బ‌ట్టే భారత్ బ‌య‌ట కూడా దేశానికి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగింద‌ని, అందులో ట్విట‌ర్ కీల‌క పాత్ర పోషించింద‌ని కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఈ కేసులోనూ బెంగుళూరుకు చెందిన దిశ ర‌వి అనే యువ కార్య‌క‌ర్త‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
లాయ‌ర్ నికితా జాక‌బ్ ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్నారు.  ఆమె అరెస్టు కోసం పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.  కాగా, తనకు అరెస్టు నుండి నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోరుతూ నికితా జాకబ్‌ ముంబయి కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఇవ్వాలని కోరారు. గురువారం ముంబయిలోని తన నివాసానికి సెర్చ్‌ వారెంట్‌తో వచ్చిన పోలీసులు.. తన గాడ్జెట్లను , పత్రాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
 
రైతు ఉద్య‌మాన్ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసేందుకు  సామాజిక కార్యకర్తలు దిశా రవి, నికితా జాకబ్‌, శంతను ఈ టూల్‌ కిట్‌ను రూపొందించారని…ఎడిటింగ్‌ కోసం ఇతరులతో పంచుకున్నట్లు తమ దర్యాప్తలో వెల్లడైందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఇందు కోసం వాట్సప్ గ్రూప్  ఉందని, దాన్ని దిశా రవి డిలీట్ చేశారని తెలిపారు.