మహారాష్ట్రలో ఒక్క రోజే 4వేల కరోనా కేసులు..రెడ్ అలర్ట్

మహారాష్ట్రలో ఒక్క రోజే 4వేల కొవిడ్-19 కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. 39 రోజుల తర్వాత ముంబై నగరంలో 600 కరోనా కేసులు నమోదైనాయి.గడచిన ఐదు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 
 
ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నగరంలోని లోకల్ రైళ్లలో ప్రజలు మాస్కులు ధరించడంతోపాటు శానిటైజేషన్ చేసుకోవాలని సూచించారు. కేరళలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, సూళ్లు, కళాశాలలు పునర్ ప్రారంభించడంతో కరోనా కేసులు పెరిగాయని వైద్యులు చెప్పారు. 
 
ముంబై లోకల్ రైళ్లలో రోజుకు 3.4 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను అప్రమత్తం చేశామని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్సు సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి చెప్పారు.

కాగా, భారతదేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 11,649 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,09,16,589కు చేరుకుంది. మరోపక్క గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 90 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,732గా ఉంది. 

ఇప్పటివరకు కరోనా నుంచి 1,06,21,220 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,39,637 యాక్టివ్ కేసులున్నాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతుండటంతో కరోనాను భారత్ నియంత్రించగలుగుతోంది.

కేంద్ర లెక్కల ప్రకారం ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 82,85,295 మంది వ్యాక్సిన్ డోస్‌ను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒకానొక సమయంలో కరోనాకు కేంద్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు పదుల సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నాయి. 

వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తరువాత కరోనా కారణంగా మరణించే వారి సంఖ్య పూర్తిగా తగ్గిందనే చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో 18 రాష్ట్రాల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాకపోవడం విశేషం.