దుస్థితిలో న్యాయవ్యవస్థ…. సమూల మార్పులు అవసరం 

దేశంలో న్యాయవ్యవస్థ దుస్థితిలో ఉన్నదని ఆందోళన  వ్యక్తం చేస్తూ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ స్పష్టం చేశారు. ‘‘ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను చేరాలని మనం లక్షిస్తున్నాం. కానీ ఇటు చూస్తే మన న్యాయవ్యవస్థ దుస్థితిలో ఉంది. పెట్టుబడులు రావాలంటే బలమైన న్యాయవ్యవస్థ అవసరం” అని పేర్కొన్నారు. 

 ఈ మధ్యే పదవీ విరమణ చేసి, ఆ వెంటనే రాజ్యసభకు నామినేట్‌ అయిన జస్టిస్‌ గొగోయ్‌ కోల్‌కతాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నిర్దిష్ట కాలావధిలో వాణిజ్య వివాదాలు పరిష్కారం కావాలి. దీనికి యంత్రాంగమేదీ? వ్యవస్థ పనిచేయడం లేదు.. వాణిజ్య కోర్టుల పరిధిలోకి ప్రతీ కేసునూ తెస్తున్నారు. మామూలు కేసులు చూసే జడ్జే ఆ కేసులనూ చూస్తున్నారు. ఇది మారాలని సూచించారు.

‘‘ఎవరు ఈ రోజుల్లో కోర్టుకెళతారు? ప్రజలు ఎందుకు కోర్టుకెళ్లామా అని చింతిస్తున్నారు. ఎవరి మాటో ఎందుకు..? నేనే వెళ్లను. కోర్టుకెళ్లి చూద్దాం అని ఎవరో కొద్దిమంది… అంటే కార్పొరేట్లు ఓ ప్రయత్నం చేస్తున్నారు. కేసు గెలిస్తే వందల కోట్లలో లాభం ఉంటుంది గనక” అని పేర్కొన్నారు. “మీరు గనక కోర్టుకెళితే వ్యక్తిగత విషయాలు బహిరంగమై మరింత కలవరం, ఇబ్బంది పడడం తప్ప మరొకటి ఉండదు. కోర్టుకెళ్లినా మీకు తీర్పు వెంటనే రాదు. సత్వర న్యాయం జరగదు. ఈ మాటలనడానికి నేను సంకోచించడం లేదు’’ అని చెప్పారు. 

2020లో దాదాపు ప్రతీ వ్యవస్థ పనితీరూ అధ్వాన్నంగా సాగిందని పేర్కొంటూ అందులో న్యాయవ్యవస్థ కూడా ఉందని తెలిపారు. ఆ సమయంలో సబార్డినేట్‌ కోర్టుల్లో దాదాపు 60 లక్షల కేసులు అదనం గా వచ్చి చేరాయి. హైకోర్టులో మూడు లక్షల కేసులు, సుప్రీంకోర్టులో ఏడువేల కేసులు దాఖలయ్యాయి. జడ్జీల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇవి ఎలా పరిష్కారమయ్యేను? అని ప్రశ్నించారు.

కొద్ది రోజుల కిందట పార్లమెంట్లో చర్చ సందర్భంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రీ తనపై విమర్శలు గుప్పించడం మీద స్పందిస్తూ ఆమె వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారని ఆక్షేపించారు. ఇదే సమయంలో ఆయన మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘మేం చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. లేదంటే మీపై విమర్శల దాడి చేస్తాం. పదవిలో ఉన్నా, రిటైరైనా టార్గెట్‌ చేస్తాం.. అని వివిధ మీడియా సంస్థలు బెదిరిస్తున్నాయి. ఇలాంటపుడు ఏ జడ్జి అయినా లొంగిపోవాల్సిందేనా? ఇలాంటి మీడియా వల్ల జడ్జీలకు అసలైన ముప్పు’’ అని అంటూ ఆయన ఎన్‌డీటీవీ, ఇండియా టుడే, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, అనేక న్యూస్‌పోర్టళ్ల పేర్లు ప్రస్తావించారు.