జలవివాదాలపై తిరుపతిలో  అమిత్ షా భేటీ

దక్షిణాది రాష్ట్రాల మధ్య నడుస్తున్న జల వివాదాలకు పరిష్కారం చూపేందుకు మార్చి 4న ఏపీలోని తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులతో  కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌, కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జల వివాదాలపై ఇప్పటికే కృష్ణా బోర్డు ఈ సమావేశానికి ఎజెండా రెడీ చేసింది. గోదావరి, కృష్ణా నదులపై రెండు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులతో పాటు నదుల అనుసంధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి, కావేరి, పెరియార్‌‌ నదీ జలాలపై వివాదాలున్నాయి.

కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ముళ్లపెరియార్‌‌ డ్యాం నీటి విడుదల విషయంలో ఏటా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో కర్నాటక ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ, ఏపీ అభ్యంతరం చెప్తున్నాయి. తెలంగాణ, ఏపీ మధ్య అనేక ప్రాజెక్టుల విషయంలో ఎడతెగని వివాదాలున్నాయి. వీటికి పరిష్కారం చూపాలని కేంద్రం భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తిరుపతిలో మార్చి 4న 29వ సదరన్‌‌ జోనల్‌‌ కౌన్సిల్‌‌ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కృష్ణా, గోదావరి బోర్డులు ఎజెండా అంశాలను కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శికి, ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌‌ ప్రిన్సిపల్‌‌ కార్యదర్శులకు పంపాయి. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఫోర్‌‌షోర్‌‌లో తలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి, నక్కలగండి (డిండి) లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులతో పాటు ఏపీ ప్రభుత్వం తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న గుండ్రేవుల రిజర్వాయర్‌‌పై సమావేశంలో చర్చించాలని కృష్ణా బోర్డు తన ఎజెండాలో ప్రతిపాదించింది.

కేఆర్‌‌ఎంబీ సమావేశాలతో పాటు అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశంలో ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇచ్చి సీడబ్ల్యూసీ టెక్నికల్‌‌ అప్రైజల్‌‌, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి పొందాలని ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు డీపీఆర్‌‌ ఇవ్వలేదని ఎజెండాలో కృష్ణా బోర్డు పేర్కొంది.  గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం థర్డ్‌‌ టీఎంసీతో పాటు సీతారామ, కంతనపల్లి, దేవాదుల థర్డ్‌‌ ఫేజ్‌‌ ప్రాజెక్టులపై చర్చించాలని గోదావరి బోర్డు సూచించింది. ఏపీలో గోదావరిపై చేపట్టిన పురుషోత్తపట్నం, పట్టిసీమపైనా సమావేశంలో చర్చించాలని సూచించింది.

గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానం అంశాన్ని సదరన్‌‌ జోనల్‌‌ కౌన్సిల్‌‌ ఎజెండాలో చేర్చారు. చెన్నై మహానగరంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు రివర్‌‌ లింకింగ్‌‌ తప్పనిసరి అని తమిళ నాడు కోరుతోంది. గోదావరిలో మిగులు జలాలే లేవని ఏపీ, తెలంగాణ వాదిస్తున్నా యి. మహానది నుంచి మొదట గోదావరికి లింక్‌‌ చేయాలని, ఆ తర్వాతే కావేరి లింక్‌‌ చేపట్టాలని తెలంగాణ ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి నదుల అనుసంధానం చేస్తే ఉపయోగమో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు.