కేరళ అభివృద్ధిని సంబరంగా జరుపుకుంటున్నాం  

భారత దేశం, కేరళ సాధిస్తున్న అభివృద్ధిని సంబరంగా జరుపుకుంటున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.  ఆయన కొచ్చిన్ పోర్టు ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను, కొచ్చిన్ షిప్‌యార్డు విజ్ఞాన్ సాగర్‌ను ప్రారంభించారు. మరికొన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ నేడు (ఆదివారం) ప్రారంభించిన పథకాలు విస్తృత పరిధిగల రంగాలకు చెందినవని తెలిపారు. కొచ్చి రిఫైనరీకి చెందిన ప్రొపిలీన్ డెరివేటివ్స్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టు మన దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా జరుగుతున్న ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. విస్తృత పరిధిగల పరిశ్రమలు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ప్రధాని చెప్పారు. 

విజ్ఞాన్ సాగర్‌‌ను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, ఇది కొచ్చిన్ షిప్‌యార్డ్‌కు చెందిన కొత్త విజ్ఞాన కేంద్రమని తెలిపారు. దీని ద్వారా మానవ వనరుల అభివృద్ధి రాజధానిని విస్తరిస్తున్నామని చెప్పారు. ప్రజలు స్థానికంగా పర్యటిస్తూ, వివిధ ప్రాంతాల్లోని విశేషాలను ఆస్వాదించాలని కోరారు. పర్యాటక రంగంలో అభివృద్ధి ప్రాజెక్టుల గురించి స్టార్టప్ కంపెనీలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. 

విల్లింగ్డన్ దీవిలో ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను రూ.25.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. అత్యాధునిక సదుపాయాలతో దీనిని తీర్చిదిద్దారు. కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్‌ సౌత్ కోల్ బెర్త్‌కు మోదీ శంకుస్థాపన చేశారు. 

బీపీసీఎల్ తెలిపిన వివరాల ప్రకారం, కొచ్చి రిఫైనరీకి దగ్గర్లో ఉన్న పీడీపీపీ మన దేశానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఆక్రిలిక్ యాసిడ్, ఓక్సో-ఆల్కహాల్, ఆక్రిలేట్స్ ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. వీటి కోసం ప్రస్తుతం దిగుమతిపై ఆధారపడుతున్నాం. పీడీపీపీలో వీటి ఉత్పత్తి ప్రారంభమైతే దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. ఈ ఉత్పత్తులను రంగులు, కోటింగ్స్, సాల్వెంట్స్, అడహెసివ్స్, వాటర్ ట్రీట్‌మెంట్ కెమికల్స్, నిర్మాణ రంగం వంటి రంగాల్లో ఉపయోగిస్తారు.