ఐఐటీ మద్రాస్‌ డిస్కవరీ క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ

చెన్నై సమీపంలోని థాయూర్‌లో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ మద్రాస్) డిస్కవరీ క్యాంపస్‌ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవం తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగింది. 

విద్యార్థులు, అధ్యాపకుల పెరుగుతున్న పరిశోధనా మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా ఈ డిస్కవరీ క్యాంపస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐఐటీ మద్రాస్‌ డిస్కవరీ క్యాంపస్‌ నిర్మాణం కోసం చెన్నైకి 36 కిలోమీటర్ల దూరంలోని థాయూర్‌లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 2017 లో 163 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

ఐఐటీ మద్రాసులోని ఈ ప్రాంగణం అత్యాధునిక స్వతంత్ర పరిశోధనా కేంద్రాలను అంకితభావ సౌకర్యాలతో నిర్వహిస్తున్నది. పరిశోధకుల కోసం హాస్టళ్లు, సాధారణ పరికరాల ప్రయోగశాలలు, సమావేశ సౌకర్యాలు వంటివి కలిగి ఉన్నది. ఐఐటీ మద్రాసులో పరిశోధన కార్యకలాపాలు గత దశాబ్దంలో విపరీతంగా పెరిగాయి. 2019 లో దీనిని ‘ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ గా ప్రకటించిన తరువాత ఈ కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించింది. అనేక రంగాలలో పరిశోధనల విజయానికి ఆజ్యం పోసిన పెద్ద పరిశోధనా కేంద్రాలకు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, పరిశ్రమ స్పాన్సర్లు నిధులు సమకూరుస్తున్నాయి.

ఈ డిస్కవరీ క్యాంపస్‌లో నిర్మిస్తున్న రెండు పరిశోధక కేంద్రాలు ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు కేంద్రాలకు నేషనల్‌ టెక్నాలజీ సెంటర్‌ ఫర్‌ పోర్ట్స్‌, వాటర్‌వేస్‌ అండ్‌ కోస్ట్స్‌, డీఆర్‌డీఓ నిధులు సమకూరుస్తున్నాయి.

కాగా, చెన్నై పర్యటన సందర్భంగా ప్రధాని  ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగ‌ల‌ర్‌ను క‌లిశారు. బంగారు అడిగలర్ చెన్నైలో ఆది పరాశక్తి చారిటబుల్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ నిర్వ‌హిస్తున్నారు. అడిగ‌ల‌ర్ అనుచరులు ఆయనను ‘అమ్మ’ అని పిలుస్తారు. ఆయనకు భారీ సంఖ్యలో భ‌క్తులు, అనుచరులు ఉన్నారు. దేవాలయాలు, ఆధ్యాత్మికతల విష‌యంలో అడిగ‌ల‌ర్ సంస్కరణలు తీసుకొచ్చారు. ఆధ్మాత్మిక రంగంలో ఆయ‌న సేవ‌ల‌కు గుర్తింపుగా నరేంద్రమోదీ ప్రభుత్వం 2019లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.