స్పృహ త‌ప్పిప‌డిపోయిన గుజ‌రాత్ సీఎం

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ ఎన్నిక‌ల ప్ర‌సంగం చేస్తూ స్పృహ త‌ప్పిప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న వ‌డోద‌ర‌లోని నిజాంపుర ఏరియాలో నిన్న చోటు చేసుకుంది. వ‌డోద‌ర‌తో పాటు మ‌రో ఆరు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌లో ఫిబ్ర‌వ‌రి 21న జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీఎం రూపానీ బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై ప్ర‌సంగిస్తుండ‌గా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయారు.  మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూపానీ ఆరోగ్యంపై ఆరా తీసారు.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన భ‌ద్ర‌తా సిబ్బంది సీఎం ప‌డిపోతుడంగా ప‌ట్టుకున్నారు. ఆ వేదిక‌పై రూపానీకి ప్ర‌థ‌మ చికిత్స అందించారు. ఆ త‌ర్వాత అహ్మ‌దాబాద్‌కు హెలికాప్టర్‌లో త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇలా  ఉండగా,విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ అని తేలిందని పేర్కొంటూ వైద్యులు సోమవారం ఓ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ఆదివారం రాత్రి వైద్యులు ఆయన ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లోనే ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. 

రెండు రోజులుగా సీఎం ఆరోగ్యం స‌రిగా లేద‌ని ఆయ‌న స‌న్నిహితులు తెలిపారు. స‌మావేశాలు ర‌ద్దు చేసుకోవాల‌ని కోరిన‌ప్ప‌టికీ శ‌నివారం జామ్‌న‌గ‌ర్‌లో, ఆదివారం వ‌డోద‌ర స‌మావేశంలో పాల్గొన్నారు.ప్ర‌స్తుతం  సీఎం రూపానీ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని తెలిపారు. లో బీపీ, రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోవడంతో నీరిసించి పోయారని చెప్పారు. అయితే 24 గంట‌ల పాటు రూపానీని అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచాల‌ని, అన్ని వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని వైద్యులు పేర్కొన్నారు. కొద్ది రోజుల పాటు సీఎంకు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు స్ప‌ష్టం చేశారు.

కాగా గుజరాత్‌లోని వడోదరతో సహా కీలకమైన ఆరుమునిసిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరగనున్నాయి.  మునిసి పాలిటీలు, జిల్లాలు, తాలూకా పంచాయతీలకు ఫిబ్రవరి 28న ఎన్నికలు జరుగుతాయి.