అంతరిక్షంలోకి ప్రధాని మోదీ ఫొటో, భగవద్గీత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఓ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకూ సిద్ధమైంది. ఈ ఉపగ్రహాల్లోనే ఒక శాటిలైట్‌లో భగవద్గీత కాపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఫొటో, అలాగే 25,000 మంది పౌరుల పేర్లను కూడా ఉంచనున్నారు.

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28, ఉదయం 10.24 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. పిఎస్‌ఎల్‌విసి-51 వాహకనౌకను ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా ప్రైవేటు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుండడం ఈ స్పేస్ క్రాఫ్ట్ ప్రత్యేకత. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1తో పాటు దేశీయ ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించనుంది. 

భారతీయ ఉపగ్రహాల్లో ‘ఆనంద్’ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ ‘పిక్సెల్’ రూపొందించగా, ‘సతీశ్ ధావన్’ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా ‘యునిటీశాట్‌ను జిట్‌శాట్(శ్రీపెరంబుదూర్), జిహెచ్‌ఆర్‌సిఇ శాట్(నాగ్‌పుర్), శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు.

వీటిలో సతీష్‌ధావన్‌ శాటిలైట్‌లో మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్‌ మిషన్‌’∙పదాలు, భగవద్గీత కాపీ, 25000 మంది పౌరుల పేర్ల జాబితాను తీసుకెళ్లనున్నట్లు స్పేస్‌ కిడ్జ్‌ సీఈవో డాక్టర్‌ శ్రీమతి కేసన్‌ తెలిపారు. అంతరిక్షంలోకి పేర్లను పంపేందుకు అడిగిన వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు. వీరందరికీ బోర్డింగ్‌ పాస్‌లు ఇచ్చామని పేర్కొన్నారు.

ప్యానెల్‌ దిగువన ఇరువైపులా ఇస్రో చైర్మన్‌ శివన్, సైంటిఫిక్‌ సెక్రటరీ ఉమామహేశ్వరన్‌ పేర్లను చెక్కినట్లు తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. ఇదే తరహాలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నామని వివరించారు.