రాజ్య‌స‌భ‌కు తృణ‌మూల్ నేత రాజీనామా

తృణమూల్‌కు మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు దినేశ్ త్రివేదీ రాజ్యసభ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు అందజేశారు. రాష్ట్రంలో రాజకీయ హింస విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
 
‘‘సభలో ఊరికే కూర్చుంటే లాభం లేదు. రాజీనామా చేయడం ఉత్తమం. బెంగాల్‌కు వెళ్లి ప్రజలతో కలిసి ఉండటం మంచిది. రాష్ట్రంలో జరుగుతున్న హింస ప్రజాస్వామ్యానికే మచ్చ. సభలో కూర్చోవడం అంత బాగుగా అనిపించడం లేదు” అంటూ స్పష్టం చేశారు. 
 
“ఏం చేయాలని ఆలోచిస్తున్నా. విశ్వకవి రవీంద్రుడి గురించి ఆలోచిస్తున్నా. పార్టీకి విధేయుడిగా ఉండాలా? ఉండాల్సిందే. కానీ నా గొంతును నులిమేస్తున్నారు. ఊరికే సభలో ఉంటూ ఏమీ మాట్లాడకపోతే బాగుండదు. అందుకే రాజీనామా చేస్తున్నా.’’ అంటూ సంచలన ప్రకటన చేశారు. 
 
తమ తమ రాష్ట్రాలకు ఎంతో కొంత చేయడానికే ఇక్కడ ఉన్నామని, ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి తిరిగి వెళ్లి, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ముందు నుంచే ఆయ‌న రాజీనామా సంకేతాలు ఇచ్చారు. గురువార‌మే దినేష్ త్రివేదీ.. ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగాన్ని అభినందించారు. ఆయ‌న ఇలా చేస్తార‌ని అనుకోలేద‌ని తృణ‌మూల్ కాంగ్రెస ఎంపీ సౌగ‌తా రాయ్ అన్నారు. 
అయితే తన గొంతు వినిపించేందుకు పార్టీలో వేదిక లేకుండా పోయిందని త్రివేది ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా గొంతు ఎక్కడ వినిపించేది? ఎవరికీ సమయం లేదు. కార్పొరేట్ ప్రొఫెషనల్ చేతిలోకి పార్టీ వెళ్లిపోయింది. ఆయన పార్టీ నడుపుతున్నారు. రాజకీయాల్లో ఏబీసీలు కూడా రాని వాళ్లు నాయకులైపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేయగలరు?’ అని త్రివేది ప్రశ్నించారు.
 
 తాను ఒక్కడినే కాదని, పార్టీలో ఎవరిని అడిగినా ఇదే అభిప్రాయం చెబుతారని తెలిపారు. మమతా బెనర్జీని చూసి పార్టీలో చేరామని, ఇప్పుడు టీఎంసీ ఎంతోకాలం పార్టీగా మనుగడ సాగించేలా టీఎంసీ లేదని స్పష్టం చేశారు. చాలా సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
బీజేపీలో చేరితే ఆయనను సాదరంగా స్వాగతిస్తున్నామని . బెంగాల్ రాష్ట్ర బీజేపీ వ్యవ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ  ప్రకటించారు. ‘‘త్రివేదీ బీజేపీలో చేరితే సాదరంగా స్వాగతిస్తాం. కేవలం త్రివేదీ మాత్రమే కాదు… నిజాయితీ తృణమూల్‌లో ఎవరు పనిచేయాలని భావించినా, వారు ఆ పార్టీలో ఉండలేరు. ఒకవేళ త్రివేదీ బీజేపీలో చేరాలని భావిస్తే.. మేం స్వాగతిస్తాం.’’ అని విజయ వర్గీయ పేర్కొన్నారు.
 
కాగా,  రాజ్య‌స‌భ మార్చి ఎనిమిదో తేదీకి వాయిదాప‌డింది. బ‌డ్జెట్‌పై చ‌ర్చ‌పూర్తి కావ‌డంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శుక్ర‌వారం రాజ్య‌స‌భలో స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం స‌భ‌ను మార్చి 8కి వాయిదా వేస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ ప్ర‌క‌టించారు. దాంతో రాజ్య‌స‌భ‌లో బ‌డ్జెట్ స‌మావేశాల మొద‌టి విడుత ముగిసిన‌ట్ల‌య్యింది. రెండో విడుత బ‌డ్జెట్ స‌మావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.