మోదీ నిబద్ధతను చాటి చెప్పిన కేంద్ర బడ్జెట్ 

తాజా బ‌డ్జెట్ అపార‌మైన‌ అనుభ‌వంతో, ప‌రిపాల‌నా సామర్థ్యాల‌తో రూపొందించిన బ‌డ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా రాజ్య‌స‌భ‌లో మాట్లాడిన నిర్మలాసీతారామ‌న్.. ప‌రిపాల‌నా సామ‌ర్థ్యాల‌కు, అనుభవానికి తాజా బ‌డ్జెట్ నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు.
ముఖ్య‌మంత్రిగా, ప్ర‌ధానమంత్రిగా సుధీర్ఘ అనుభ‌వం ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి దేశ అభివృద్ది, వృద్ధి, సంస్క‌ర‌ణ‌ల మీద ఉన్న నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌స్తుత బ‌డ్జెట్ చాటిచెప్పింద‌ని నిర్మ‌ల చెప్పారు. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది జ‌నాభాకు ఉచితంగా ఆహార ధాన్యాల‌ను అందజేస్తున్న‌ విష‌యాన్ని తాజా బ‌డ్జెట్ ప్ర‌స్తావించింద‌ని ఆమె గుర్తు చేశారు.
అంతేగాక దేశంలో ఎనిమిది కోట్ల మందికి ఉచిత వంట‌గ్యాస్‌, 40 కోట్ల మంది రైతులు, మ‌హిళ‌లు, దివ్యాంగులు త‌దిత‌రుల‌కు వివిధ ప‌థ‌కాల కింద‌ ప్ర‌త్య‌క్షంగా న‌గ‌దు అందజేస్తున్నామ‌ని ఆమె తెలిపారు. అయితే పేద‌ల కోసం తాము ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామో తెలిసి కూడా ప్ర‌తిప‌క్షాలు బ‌డ్జెట్ అల‌వాటుగా త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని ఆమె విమ‌ర్శించారు.
 
‘ధ‌న‌వంతుల‌కు ల‌బ్ధి చేకూర్చేలా బ‌డ్జెట్ రూపొందించామంటున్న ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని నిర్మ‌లాసీతారామ‌న్ స్పష్టం చేశారు. 2016, ఆగ‌స్టు నుంచి 2020, జ‌న‌వ‌రి వ‌ర‌కు యూపీఐ ద్వారా రూ 3.6 లక్ష‌ల కోట్ల డిజిట‌ల్ లావాదేవీలు జ‌రిగాయ‌ని ఆర్థిక మంత్రి తెలిపారు. 
 
యూపీఐని ఎవ‌రు ఉప‌యోగిస్తున్నారు..? ధ‌న‌వంతులా..? కాదు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, చిరు వ్యాపారులు. వీళ్లంతా కుబేరులా..? ప‌్ర‌భుత్వం యూపీఐని క్రియేట్ చేసింది, డిజిట‌ల్ లావాదేవీల సౌక‌ర్యం క‌ల్పించింది ధ‌న‌వంతుల‌కు ల‌బ్ధి చేకూర్చ‌డం కోస‌మా..? కాదు, కదా..!’ అని నిర్మ‌లా సీతారామ‌న్ స్పష్టం చేశారు.