షర్మిల తెలంగాణలో రాజకీయం… దృష్టి అంతా ఏపీ వైపే!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో స్థాపించదలచిన రాజకీయ పార్టీ .. వైసీపీని కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి శిబిరంలో కల్లోలం రేపుతున్నది. అన్నాచెల్లెళ్ల మధ్య అగాధం పెద్దదైందని కథనాలు వస్తుండడం జనంలో తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

షర్మిలా ప్రస్తుతం తన రాజకీయ కార్యకలాపాలు తెలంగాణకు పరిమితమని సంకేతం ఇస్తున్నా ఆమె దృష్టి అంతా ఆంధ్ర ప్రదేశ్ వైపే అనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. తగిన సమయంలో ఆమె ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.

జగన్ కాకుండా ఆయన భార్య భారతి గానే లేదా ఆయన సూచించిన మరొకరు గాని ఏపీలో సారధ్యం వహించవలసిన పరిస్థితులు ఏర్పడితే దానిని అదనుగా తీసుకొని రంగంలోకి దిగేందుకు ఆమె పధకాలు వేస్తున్నారని ప్రచారం కూడా జరుగుతున్నది.

ఈ నేపథ్యంలో.. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గురువారం హైదరాబాద్‌ లోట్‌సపాండ్‌కు వెళ్లి షర్మిల, ఆమె భర్త బ్రదర్‌  అనిల్‌కుమార్‌తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరింప చేసుకున్నది. ఇది ఉభయ రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

జగన్‌ తరఫున ఆళ్ల  సందేశం తెచ్చారని, పలు అంశాలపై చర్చ జరిగిందని గురువారం రోజంతా ప్రసార సాధనాలు హోరెత్తించాయు. షర్మిలతో జగన్‌ నేరుగా మాట్లాడలేకనే ఆళ్లను రంగంలోకి దించారని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. వాస్తవానికి షర్మిల రాజకీయ పార్టీ స్థాపనపై  స్పందించవద్దంటూ పార్టీ శ్రేణులకు అధిష్ఠానం ఆదేశించిందని ఆ పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు.

కానీ ఆళ్ల హైదరాబాద్‌లో షర్మిలతో సమావేశం కావడం.. రాజకీయంగా వేడెక్కించింది. తెలంగాణలో రాజకీయ ప్రస్థానం జోరు పెంచుతానని, దీనిపై వెనక్కి తగ్గేది లేదని ఆయనతో షర్మిల స్పష్టం చేశారని వార్తలు ప్రసారమయ్యాయి.

అయితే తాను మర్యాదపూర్వకంగానే సమావేశమయ్యానని.. వైఎస్‌ కుమార్తెగా షర్మిల అంటే తనకు గౌరవమని ఆళ్ళ తెలిపారు. తమ మధ్య ఎలాంటి రాజకీయాంశాలూ చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అటు షర్మిల సన్నిహిత వర్గాలు కూడా.. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని తెలిపాయి.  గతంలో షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఆయనే వెంట ఉన్నారని, ప్రస్తుతం ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పడానికే వచ్చారని అంటున్నాయి.

మరోవంక, తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ఏర్పాట్లలో ఉన్న షర్మిల.. జిల్లాల పర్యటనకూ సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైఎస్‌ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఖమ్మం వెళ్లాలని నిర్ణయించారు. 

షర్మిల వెంట సుమారు 250 కార్లు ర్యాలీగా వెళ్లనున్నట్లు సమాచారం. మార్గమధ్యంలో హయత్‌నగర్‌, చౌటుప్పల్‌, నార్కట్‌పల్లి, నకిరేకల్‌, సూర్యాపేటల్లో ఆమె అభిమానులను పలకరించనున్నట్లు చెబుతున్నారు. ఖమ్మంలోనూ వేలాది మందితో భారీ ర్యాలీలో పాల్గొంటారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.