మేయర్‌గా విజయలక్ష్మి.. డిప్యూటీ మేయర్‌గా శ్రీలత

గ్రేటర్ మేయర్‌గా టీఆర్ఎస్ కీలక నేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. 
 
దీంతో ఎక్స్‌ అఫిషియా ఓట్లతో సంబంధం లేకుండానే యేయర్ ఎన్నిక పూర్తయ్యింది. అయితే.. ఈ మద్దతును వ్యతిరేకిస్తూ కౌన్సిల్ హాల్‌లో జైశ్రీరామ్ నినాదాలతో బీజేపీ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. 
నూత‌నంగా ఎన్నికైన మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మికి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్ష‌లు తెలిపారు. మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫ‌సీయుద్దీన్‌, గాజుల‌రామారం కార్పొరేట‌ర్ శేష‌గిరి ప్ర‌తిపాదించారు.
డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త పేరును మ‌చ్చ‌బొల్లారం కార్పొరేట‌ర్ రాజ్ జితేంద‌ర్ నాథ్, కూక‌ట్‌ప‌ల్లి కార్పొరేట‌ర్ జూప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ‌ ప్ర‌తిపాదించారు. అనంత‌రం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అధికారి శ్వేతా మ‌హంతి ఎన్నిక ప్ర‌క్రియ చేప‌ట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయ‌ర్‌ను ఎన్నుకున్నారు. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ఎంఐఎం మ‌ద్ద‌తు ఇచ్చింది.
మేయ‌ర్‌గా ఎన్నికైన గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి.. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. హైద‌రాబాద్ అభివృద్ధి కోసం అంద‌రి స‌ల‌హాలు స్వీక‌రిస్తాను అని పేర్కొన్నారు. న‌గ‌రంలో మ‌హిళ‌ల‌కు మ‌రింత భ‌ద్ర‌త క‌ల్పిస్తాను అని స్ప‌ష్టం చేశారు.
అవినీతిపై పోరాటం కోసం ఎంత దూర‌మైన వెళ్తాను అని తేల్చిచెప్పారు. మేయ‌ర్‌గా, డిప్యూటీ మేయ‌ర్‌గా ఒకేసారి ఇద్ద‌రు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ఇచ్చినందుకు ముఖ్య‌మంత్రికి మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని విజ‌య‌ల‌క్ష్మి పేర్కొన్నారు.