‘వోకల్ ఫర్ లోకల్’కు స్ఫూర్తి పండిట్ దీన్‌దయాళ్

రాజకీయాల కన్నా జాతీయ విధానాలకే భారతీయ జనతా పార్టీ పెద్ద పీట వేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బీజేపీ తన ప్రత్యర్థులను సైతం గౌరవిస్తుందని పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ నేత పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 53వ వర్ధంతి సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

దీన్‌దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించిన అనంతరం మోదీ బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారత దేశం స్థానిక ఉత్పాదక సామర్థ్యాన్ని, తయారీ సామర్థ్యాన్ని పటిష్టం చేసుకోవాలని దీన్‌దయాళ్ పిలుపునిచ్చారని, ఆయన ఇచ్చిన పిలుపు తాజాగా ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రొడక్ట్స్‌ నినాదానికి బాటలు పరిచిందని తెలిపారు. 

మన దేశం కేవలం వ్యవసాయ రంగంలోనే కాకుండా రక్షణ, ఆయుధాల రంగాల్లో కూడా స్వయం సమృద్ధి సాధించాలని దీన్‌దయాళ్ 1965నాటి యుద్ధం సమయంలో చెప్పారన్నారు. తేజస్ వంటి యుద్ధ విమానాలను, ఆయుధాలను ప్రస్తుతం మన దేశంలోనే తయారు చేస్తున్నట్లు తెలిపారు. 

బీజేపీ ఎల్లప్పుడూ రాజకీయాల కన్నా జాతీయ విధానాలకే పెద్ద పీట వేస్తుందని చెప్పారు. తన ప్రత్యర్థులను సైతం బీజేపీ గౌరవిస్తుందని చెప్పారు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆలోచనలు నేటికీ ఆచరించదగినవేనని చెప్పారు. ఆయన ఆలోచనలు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయని చెప్పారు. 

మానవాళి సంక్షేమం గురించి మాట్లాడినపుడు సమగ్ర హ్యూమన్ ఫిలాసఫీ ఆచరణ యోగ్యమైనదవుతుందన్నారు. మనమంతా మన విజ్ఞాన పరిధులను విస్తరించుకోవడానికి ప్రయత్నించాలన్నారు. అధ్యయనం చేయడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.