‘టీఆర్ఎస్-ఎంఐఎం మధ్య అక్రమ సంబంధం‘

జీహెచ్ఎంసీ  మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టి ఆర్ ఎస్ – ఎంఐఎం మధ్య అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని చెప్పారు. 
 
 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చెప్పిన విషయం నిజమైందని తెలిపారు. టి ఆర్ ఎస్ – ఎం ఐ ఎం  చీకట్లో ప్రేమించుకుంటూ బయటకు వేర్వేరు అని చెప్పాయని.. రెండు కలిసి పోటీ చేయకపోతే టి ఆర్ ఎస్ కు సింగిల్ డిజిట్ కూడా వచ్చేది కాదని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పక్కా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంకు చెంచా అని విమర్శించారు. జీహెచ్ఎంసీ లో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని పేర్కొన్నారు. సిగ్గులేకుండా ఎన్నికల్లో మేము వేర్వేరని ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.
రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునే కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ కార్పొరేటర్లు హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటారని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. పైసా అవినీతికి పాల్పడినా, ఇంచు జాగా వదిలేసినా రెండు పార్టీలను బజారుకు లాగుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ నీచ రాజకీయాలను గమనిస్తున్నారని.. టైం వచ్చిన ప్రతీసారీ కర్రు కాల్చి వాత పెడుతున్నారని విమర్శించారు .