పెద్దిరెడ్డి న్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలూ వద్దు 

పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషనర్‌పై ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయొద్దని ఆదేశించింది. 

ఎన్నికల ప్రక్రియపై, రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల్లో భాగస్వాములైన అధికారులను బెదిరించబోనని, వారి ప్రతిష్ఠను దిగజార్చనని ధర్మాసనానికి ఇచ్చిన హామీని మంత్రి పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.

 మంత్రిని పూర్తిగా మీడియాతో మాట్లాడకుండా నియంత్రించడం ప్రాథమికంగా చూస్తే సమర్థనీయం కాదని పేర్కొంది. మీడియా సమావేశాలు పెట్టుకునేందుకు అనుమతించింది. అదే సమయంలో ఎన్నికల స్వచ్ఛతను, పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు ఇచ్చింది. 

పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు తనను మీడియాతో మాట్లాడకుండా నిలువరిస్తూ ఎస్‌ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సమర్థించడాన్ని సవాల్‌ చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసిన విషయం తెలిసిందే. మంగళవారం సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తన నిర్ణయాన్ని వాయిదా వేసింది.

కమిషనర్‌ నిమ్మగడ్డ వాదనలు వినకుండా వ్యాజ్యాన్ని పరిష్కరించలేమని బుధవారం మరోసారి అభిప్రాయపడింది. మంత్రి తరఫు సీనియర్‌ న్యాయవాది స్పందిస్తూ… పిటిషన్‌లో కమిషనర్‌పై చేసిన ఆరోపణలు, ఎస్‌ఈసీని ప్రతివాదిగా తొలగిస్తూ మెమో వేస్తామని తెలిపారు. అందుకు ధర్మాసనం అనుమతిస్తూ మంత్రి అప్పీల్‌నుపరిష్కరించింది. 

ఇలా ఉండగా; అనంతపురంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, ఆయన సోదరుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నందున వారిని నిరోధించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ ను వైసీపీ నేతలు కోరారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కూడా భయభ్రాంతులకు లోనుచేస్తున్నారని, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పార్టీ కండువా కప్పుకుని  ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.