12వ తేదీన విచారణకై సుజనాకు ఈడీ నోటీసులు

బ్యాంకుల వద్ద రుణాలను తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన కేసులో కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)‌ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12వ తేదీన విచారణకు హాజరుకావాలని సుజనాకు ఈడీ నోటీసులు అందించింది. 

డొల్ల కంపెనీలతో సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు అభియోగాలు నమోదైన విషయం తెలిసిందే. రూ.5,700 కోట్ల మేర బ్యాంకులను మోసం చేశారనే అభియోగాలపై ఈడీ కేసులు నమోదు చేసింది. కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే సుజనా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి.

ఇప్పటికే ఆయనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు సీబీఐ నమోదు చేసింది. వీటి ఆధారంగా 2018లో సుజనాపై ఈడీ సోదాలు జరిపింది. 126 షెల్‌ కంపెనీలు సృష్టించి సుజనా రూ.కోట్లు కొల్లగొట్టినట్టు ఆధారాలు సేకరించింది.

వాటిలో సెంట్రల్‌ బ్యాంకును రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకును రూ.71 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంకుకు రూ.159 కోట్లు సుజనా మోసం చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ కేసులు విచారిస్తున్న చెన్నెలోని సెషన్స్‌ కోర్టు నోటీసులు పంపించింది.