స్టీల్‌ ప్లాంట్‌పై తుది నిర్ణయం కేంద్రానిదే

స్టీల్‌ ప్లాంట్‌పై తుది నిర్ణయం కేంద్రానిదే

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కోరినట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీలో తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. స్టీల్‌ ప్లాంట్‌పై తుది నిర్ణయం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీ ప్రజల మనోభావాలకు ప్రతీకగా భావించాలని కేంద్ర మంత్రులను కోరామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ చేయాలనుకుంటే ఏదైనా చేయవచ్చని ఆయన చెప్పారు. కేంద్రమంత్రి చెప్పినట్టుగా పోస్కో, స్టీల్ ప్లాంట్ మధ్య ఒప్పందం జరిగినప్పుడు.. జగన్‌ లేఖ రాయడంలో ఆంతర్యమేంటని పవన్‌ ప్రశ్నించారు.

మార్చి 3, 4 తేదీల్లో జనసేన, బీజేపీ రోడ్‌ మ్యాప్ సిద్ధం చేసుకోనున్నట్టు తెలిపారు. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని అమిత్‌ షాకు వివరించానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. దేవాలయాలపై దాడుల విషయాన్ని అమిత్‌ షా దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పారు. 

కాగా, షర్మిల పార్టీపై స్పందిస్తూ  ‘షర్మిలా ఇంకా పార్టీ స్థాపించలేదు కదా?, పార్టీ విధివిధానాలు వచ్చాక మాట్లాడదాం’ అని తెలిపారు. `ప్రతీ ఒక్కరూ పార్టీ పెట్టుకోవచ్చు. తెలంగాణలో షర్మిల పార్టీ రావాలనే కోరుకుంటున్నా. కేసీఆర్ పాలన గురించి హైదరాబాద్‌లోనే మాట్లాడతా’ అని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు.

రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణను కేరళ ప్రభుత్వం అడ్డుకుందని కేంద్ర మంత్రి మురళీధరన్‌ తమకు చెప్పారని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వైజాగ్‌ స్టీల్‌ ప్రయివేటీకరణను అడ్డుకోవాలని కోరారు.