ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచిన రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగం 

పార్ల‌మెంటు ఉభ‌య‌స‌భ‌లను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్ర‌సంగం భార‌తదేశ ప్రజల ఆత్మశక్తిని ఇనుమడింప చేసిన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. భారత ప్రజల  సంక‌ల్ప శ‌క్తిని ప్రపంచానికి చాటి చెప్పింద‌ని ప్ర‌ధాని చెప్పారు.

రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌స‌భ‌లో స‌మాధానం ఇచ్చిన ప్ర‌ధాని మోదీ.. వివిధ అంశాల‌పై సుధీర్ఘంగా మాట్లాడుతూ రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై చ‌ర్చ‌లో పెద్ద సంఖ్య‌లో మ‌హిళా ఎంపీలు పాల్గొన్నార‌ని, దేశంలో మ‌హిళ‌ల ప్ర‌గ‌తికి ఇది ఒక గొప్ప సంకేత‌మ‌ని ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యానించారు.

వారి అమూల్య‌మైన ఆలోచ‌న‌ల‌తో మ‌హిళా ఎంపీలు స‌భ వ్య‌వ‌హారాల ఔన్న‌త్యాన్ని పెంపొందించార‌ని కొనియాడారు. మ‌రికొద్ది నెల‌ల్లో దేశంలో 75వ స్వాతంత్య్ర  దినోత్స‌వం జ‌రుపుకోబోతున్నామ‌ని, ఇది దేశంలోని ప్ర‌తి పౌరుడికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని మోదీ పేర్కొన్నారు.

మ‌రో 25 ఏండ్ల త‌ర్వాత భార‌త్ వందేండ్ల స్వాతంత్ర్య వేడుక‌లు జ‌రుపుకుంటుంద‌ని, అప్ప‌టిక‌ల్లా దేశాన్ని మ‌రింత మెరుగైన స్థితిలో నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌ధాని సూచించారు. ప్ర‌తి పౌరుడు ప్ర‌పంచంలో ఏ మూల‌న ఉన్నా, స‌మాజంలో ఏ స్థాయిలో ఉన్నా దేశ ప్ర‌గ‌తి కోసం త‌న వంతు కృషి చేయాల‌ని కోరారు.

క‌రోనా మ‌హ‌మ్మారి అనంత‌రం ప్ర‌పంచ దేశాల్లో స్థితిగ‌తులు పూర్తిగా మారిపోయాయ‌ని ప్ర‌ధాని గుర్తుచేశారు. క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ దేశం ఎదురొడ్డి నిలిచింద‌ని ప్ర‌ధాని చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌కు భార‌త్ ఆశాకిర‌ణంలా మారింద‌ని పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డిలో మ‌నం స్ట్రాంగ్ ప్లేయ‌ర్స్‌గా నిలిచామ‌ని కొనియాడారు.

ప్ర‌స్తుతం ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ నిర్మాణ‌మే ల‌క్ష్యంగా భార‌త్ ముందుకు సాగుతున్న‌ద‌ని చెప్పారు. ఇప్పుడు దేశంలో ఏ మూల‌కు వెళ్లినా ఓక‌ల్ ఫ‌ర్ లోక‌ల్ అనే నినాదం వినిపిస్తున్న‌ద‌ని, దేశ ప్ర‌జ‌లు స్థానికత‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ప్ర‌ధాని తెలిపారు.