ట్విట్టర్‌ బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్‌లో ట్రిండింగ్ 

ట్విట్టర్ వ్యవహారశైలిపై ప్రభుత్వంతో పాటు కొంత మంది నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌ను బ్యాన్ చేయాలంటూ ట్విట్టర్‌లోనే ట్వీట్లు చేస్తున్నారు. ‘బ్యాన్ ట్విట్టర్’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఇండియా ట్రెండింగ్స్‌లో ఉంది. గణతంత్ర దినోత్సవాలనాడు రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మొదలైంది. 250 ట్విటర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. 

ట్విటర్ కొన్ని ఖాతాలపై చర్యలు తీసుకుని, కొద్ది గంటల్లోనే వాటిని పునరుద్ధరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. హింసాకాండను రెచ్చగొడుతున్న ట్విటర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

కాగా, ట్విట్టర్‌లో ‘బ్యాన్ ట్విట్టర్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉండడంపై నెటిజెన్లు జోకులు పేలుస్తున్నారు. ట్విట్టర్‌ను బ్యాన్ చేయమని ట్విట్టర్‌లోనే ట్రోల్స్ చేయడమేంటని వరుస ట్వీట్ల వర్షం కురుపిస్తున్నారు. అందులో కొన్ని ఈ కింద చూడండి.

మరోవంక, ట్విటర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రైతుల ఆందోళనలపై రెచ్చగొట్టే ట్వీట్లు చేస్తున్నారనే నెపంతో 1178 అకౌంట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ట్విటర్‌ మాత్రం కేవలం 500 ట్వీట్లను మాత్రమే తొలగించింది. మిగతా వాటిని భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో తొలగించడం లేదని చెప్పింది. 

ట్విట్టర్‌ తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో చర్చించే అవకాశం కల్పించాలని ట్విట్టర్‌ కోరిందని, ఐటీ శాఖ కార్యదర్శితో ట్విట్టర్‌ సీనియర్‌ అధికారులు సమావేశమయ్యేందుకు అంగీకారం తెలిపామని కేంద్రం తెలిపింది. ఈలోపే ట్విట్టర్‌ బ్లాగ్‌పోస్టులో తన వాదనను ప్రచురించడం పద్ధతి కాదని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు తన స్పందనను స్వదేశీ సామాజిక మాధ్యమం ‘కూ’లో తెలియజేసింది. భారత్‌లోనే రూపొందించిన ‘కూ’ను ట్విట్టర్‌కు పోటీగా భావిస్తున్నారు.

దీనిపై తాజాగా ప్రభుత్వం స్పందించింది. భారత్ లో ట్విటర్‌కు ప్రత్యర్థి అయిన ‘కూ’…ద్వారా ట్విటర్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఆదేశించిన దానికి.. ట్విటర్‌ మేనేజ్‌మెంట్‌ చేసింది పూర్తి విరుద్ధంగా ఉందనీ.. ట్విటర్‌ స్పందన కూడా అసహజంగా ఉందని మోడీ సర్కార్‌ అభిప్రాయపడుతోంది.

దీనిపై ప్రభుత్వం త్వరలోనే స్పందిస్తుందని ‘కూ’లో ట్విటర్‌కు రిప్లై ఇచ్చింది. కాగా, ప్రభుత్వంతో సమావేశం కావాలన్న ట్విటర్‌ ప్రతిపాదనను ఐటీ శాఖ కార్యదర్శి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్విటర్‌ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడుతున్నారు.