రాజ్యసభలో ఆజాద్ గురించి ప్రధాని మోదీ భావోద్వేగం

కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. గులాం న‌బీ ఆజాద్ రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ముగియ‌నంది. ఆజాద్ రిటైర్మెంట్ సంద‌ర్భంగా ప్రధాని మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన పార్టీ కోసమే కాకుండా దేశం కోసం ఆజాద్ పనిచేశారని ప్రధాని కొనియాడారు. గులాంనబీ ఆజాద్ తనకు మంచి మిత్రుడని ఆయన పేర్కొన్నారు. జ‌మ్మూక‌శ్మీర్ ముఖ్యమంత్రిగా ఆజాద్ ఉన్న స‌మ‌యంలో ఆయ‌న చేసిన మేలును మరిచిపోన‌ని ప్రధాని చెప్పారు. 
 
క‌శ్మీర్‌లో ఉగ్ర‌దాడి జ‌రిగిన‌ప్పుడు, అక్క‌డ గుజ‌రాతీ ప‌ర్యాట‌కులు చిక్కుకున్నార‌ని, ఆ స‌మ‌యంలో తాను ఆజాద్ వ‌ద్ద సాయం కోరాన‌ని చెప్పారు. అప్పుడు గులాం న‌బీ త‌న‌కు అనుక్ష‌ణం వారి గురించి సమాచారం ఇచ్చార‌ని మోదీ తెలిపారు. వారిని తన కుటుంబ సభ్యులను చూసినట్టు చూసుకున్నారని గుర్తుచేశారు.
 
ఆజాద్ తో తనకు సాన్నిహిత్యం ఉందని ప్రధాని మోదీ  కంటతడి పెట్టుకుంటూ రాజ్యసభలో భావోద్వేగానికి లోనయ్యారు. పదవీ విరమణ పొందుతున్న నేతల వీడ్కోలు సందర్భంగా మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ తన దుంఖాన్ని ఆపుకునే ప్ర‌య‌త్నంలో మంచినీళ్లు తాగడం కోసం ఆగడంతో  సభ చప్పట్లో మారుమోగింది.

మీ పదవీ విరమణను  అంగీకరించను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి’  అని ఈ ఫిబ్రవరి 15 తో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఆజాద్ నుద్దేశించి మోదీ తెలిపారు. గులాం నబీ జీ ఎప్పుడూ మర్యాదగా మాట్లాడతారు. ఎప్పుడూ అసభ్యకరమైన భాషను ఉపయోగించరు. ఈ విషయంలో ఆయన్నుంచి నేర్చుకోవాలని పేర్కొన్నారు. అలాగే కశ్మీర్‌ ఎన్నికలను ఆజాద్‌ స్వాగతించారంటూనే కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

మరోవైపు దీనిపై ఆజాద్‌ స్పందిస్తూ పార్టీ పరంగా విభేదాలున్నా..పలు విషయాలపై ఇరువురం పరస్పరం వాదించుకున్నా, విమర్శించుకున్నా, వ్యక్తిగత సంబంధాలను  దెబ్బతీయలేదని తెలిపారు. పండుగల సందర్భంగా తప్పనిసరిగా పలకరించే వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీ ఉంటారని గుర్తు చేసుకున్నారు.

ఒక భారతీయ ముస్లింగా తాను ఎంతో గర్వపడుతున్నానని గులాంనబీ ఆజాద్‌ తెలిపారు. రాజ్యసభలో తనకు ఘనంగా లభించిన వీడ్కోలుపై సంతోషం వ్యక్తంచేస్తూ ప్రపంచంలో ముస్లింగా గర్వపడేవాళ్లు భారతీయ ముస్లింలు మాత్రమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘భారతదేశమే ఒక స్వర్గమని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేను జన్మించాను. పాకిస్థాన్‌కు వలస పోకుండా ఆగిపోయిన అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని. పాకిస్థాన్‌లో పరిస్థితులను చూసిన తర్వాత భారతీయ ముస్లింగా నేను గర్విస్తున్నాను. ఈ దేశంలో (కశ్మీర్‌లో) ఉగ్రవాదం అంతం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి ఇరాక్‌ వరకు ముస్లిం దేశాలన్నీ ఎన్నో ఏండ్లుగా ఎలా ధ్వంసమవుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఆ దేశాల్లో ముస్లింలే పరస్పరం కొట్లాడుకొంటున్నారు’ అని పేర్కొన్నారు.