ఉత్తరాఖండ్‌లో 197 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలలో దాదాపు 197 మంది గల్లంతు అయ్యారు. 20 మంది మృతి చెందినట్లుగా ఇప్పటికి నిర్థారణ అయింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో తెలిపారు. ఆదివారం నందా దేవి కొండచరియలు విరిగిపడి ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు వచ్చిపడి విలయం సృష్టించాయి. ఇప్పటికీ సహాయ చర్యలు సాగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివరాలలో మృతుల సంఖ్యపై స్పష్టత ఇప్పటికిప్పుడు అసాధ్యం అవుతుందని షా తెలిపారు.

అక్కడి ఆకస్మిక పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో అనుక్షణ పర్యవేక్షణ జరుపుతోంది. ప్రధాని మోదీ  కూడా స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపారు. రిషిగంగ జల విద్యుత్ ప్రాజెక్టుకు పూర్తిగా దెబ్బతిందని, ఇది స్వల్ప ఉత్పత్తి సామర్థపు విద్యుత్ ప్రాజెక్టు అయినప్పటికీ దీని ద్వారా ఇతర చోట్లకు వరద నీరు ప్రవహించడంతో తపోవన్ వద్ద నిర్మాణంలో ఉన్న 520 ఎండబ్లు సామర్థపు ఎన్‌టిపిసి హైడ్రో పవర్ ప్రాజెక్టు దెబ్బతిందని అమిత్ షా తెలిపారు.

ఘటన నాటి నుంచి దాదాపు 200 మంది జాడ తెలియకుండా పోవడం ఆందోళన కల్గించే పరిణామం అని పేర్కొన్నారు. టన్నెల్‌లో చిక్కుపడ్డ వారిని రక్షించేందుకు, గల్లంతు అయిన వారిని కనుగొనేందుకు అన్ని విధాలుగా యత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు.

కాగా, ఆదివారం నాటి జలవిలయంతో మృతి చెందిన వారి సంఖ్య ఇప్పుడు 31కు చేరుకుందని ఉత్తరాఖండ్ అధికారులు మంగళవారం తెలిపారు. ఐదు మృతదేహాలను ఇప్పుడు కనుగొనడంతో 31 మంది ఆకస్మిక వరదలు సంబంధిత వైపరీత్యానికి బలి అయ్యారని నిర్థారణ అయింది. ఇక తపోవన్ ప్రాంతంలో ఓ భారీ టన్నెల్‌లో చిక్కుపడ్డ 30 మంది కూలీలను రక్షించే పనులు రెండు రోజులుగా విరామం లేకుండా సాగుతున్నాయి. రాష్ట్ర అత్యవసర సేవల నిర్వహణ కేంద్రం వారు డెహ్రాడూన్, జోషిమఠ్ వద్ద వివరాలు తెలియచేశారు.

ఆదివారం నుంచి ఇప్పటివరకూ అత్యధిక సంఖ్యలోనే జనం జాడ తెలియకుండా పోవడంతో వీరి పరిస్థితి ఏమై ఉంటుందనేది అగమ్యగోచరంగా మారింది. పలు ప్రాంతాలలో తమ వారి ఆచూకి కోసం ఆందోళన వ్యక్తం అయింది. సైన్యం, ఐటిబిపి, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ ఇతర దళాలు పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తూ సహాయక చర్యలను చేపడుతున్నాయి. 

ఉత్తరాఖండ్ వైపరీత్యం నాటి నుంచి జాడతెలియకుండా పోయిన వారిలో 70 మంది యుపి వారు ఉన్నట్లు వెల్లడైంది. వీరిలో 34 మంది లఖింపూర్ ఖేరీ జిల్లాకు చెందిన వారే. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ సంజయ్ గోయల్ లక్నోలో తెలిపారు.