బడ్జెట్ పట్ల సానుకూలంగా మార్కెట్లు 

కేంద్ర బడ్జెట్ 2021-22ను స్టాక్‌మార్కెట్లు సానుకూలంగా తీసుకున్నాయని, గత వారం నుంచి మార్కెట్లు 11 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రైవేటురంగానికి గొప్పగా పనిచేసిందని, వ్యాపార అవకాశాలు పెంచడంతో పాటు ఖర్చుపై స్పష్టత, ఏ అంశాలకు దూరంగా ఉండాలో తెలిసిందని చెప్పారు. 

బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఇప్పటికి 10 రోజులు అవుతుందని, మొదటిసారి మార్కెట్లు సానుకూలంగా పూర్తి వారం కొనసాగాయి. గతంలో మార్కెట్లు కొద్ది గంటలు మాత్రమే సానుకూలంగా ఉండగా, ఇప్పుడు మార్కెట్లు కొద్ది రోజులపాటు సానుకూలంగా కొనసాగాయని, ఇది మంచి సందేశం అని ఆమె పేర్కొన్నారు. 

ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల్లో నమ్మకం పెంచేందుకు చర్యలు తీసుకుందని, దీంతో పన్ను పరిధి పెరిగే అవకాశముంది. అలాగే పన్ను చెల్లింపుదారులపై ఎలాంటి అదనపు భారం మోపదల్చుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక లోటుపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీతారామన్ చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 9.5 శాతం ఉంటుందని అంచనా. ఆర్థిక లోటును నివారించలేమని, అయితే అదే సమయంలో దానిని పర్యవేక్షించి జాగ్రత్తగా అరికట్టాలని త్లెఇపారు. ప్రస్తుత ఆర్థిక బడ్జెట్‌లో ద్రవ్య లోటును జిడిపిలో 3.5 శాతంగా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుని పేర్కొన్నారు.

కానీ కోవిడ్ -19 సంక్షోభం కారణంగా ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ద్రవ్యలోటు ఎక్కువగా ఉంటుందని అంచనా. ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు జిడిపిలో 9.5 శాతంగా ఉంటుందని సవరించిన అంచనా చెబుతోంది. ప్రభుత్వ వ్యయం, ఆదాయం మధ్య వ్యత్యాసాన్ని చూపే ఆర్థిక లోటు వచ్చే 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 6.8 శాతంగా ఉంటుందని అంచనా.

2025-26 నాటికి దీనిని 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం బడ్జెట్‌ను పారదర్శకంగా మార్చిందని, దాచడానికి ఏమీ లేదని ఆర్థిక మంత్రి త్లెఇపారు. ‘ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందో, ఏది, ఎక్కడ ఖర్చు చేస్తుందో అందరూ చూడగలరు’ అని ఆమె అన్నారు. ఇతర సంబంధిత పరిశ్రమలపై విస్తృత ప్రభావాన్ని చూపే రంగాలపై ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తోందని సీతారామన్ పేర్కొన్నారు. 

డెవలప్‌మెంట్ ఫైనాన్స్ ఇనిస్టిట్యూట్ (డిఎఫ్‌ఐ)ను ప్రస్తావిస్తూ మౌలిక సదుపాయాల రంగానికి దీర్ఘకాలిక నిధులు సమకూర్చడం డిఎఫ్‌ఐ పని అని తెలిపారు. కానీ ఈ పని కేవలం డిఎఫ్‌ఐ మాత్రమే కాదు, ప్రైవేట్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలకు ముందుకు రావడానికి ఇది ఒక అవకాశం అని చెప్పారు.