65 శాతం ఆరోగ్య కార్యకర్తలకు కరోనా వ్యాక్సిన్

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 65శాతానికిపై పైగా ఆరోగ్య కార్యకర్తలకు కోవిడ్-19 వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కేరళ ఉన్నాయని, ఆరోగ్య సంరక్షణ కార్మికులందరూ ఫిబ్రవరి 20 లోపు టీకాలు తీసుకునేందుకు కనీసం ఒక్కసారైనా షెడ్యూల్ చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరో వైపు దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో కరోనా వైరస్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది.

కరోనా టీకా కారణంగా సైడ్‌ఎఫెక్ట్స్ కలిగిన సందర్భాల్లో తట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక బీమా సౌకర్యం ఏదీ లేదని కేంద్రం తాజాగా పేర్కొంది. కరోనా టీకా తీసుకోవాలా వద్దో నిర్ణయించుకునేందుకు లబ్ధిదారులకు పూర్తి స్వేఛ్చ ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా టీకాపై చర్చ సందర్భంగా రాజసభలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే ఈ ప్రకటన చేశారు.

ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేలా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రాల్లో అనాఫిల్యాక్సిన్ కిట్లు అందుబాటులో ఉంచడం, బాధితులను తక్షణం ఏఈఎఫ్ఐ కేంద్రానికి తరలించడం వంటి ఏర్పాట్లు చేసినట్టు మంత్రి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలిపారు. 

ఎఈఎఫ్‌ఐ చికిత్స మొత్తం ఉచితంగానే లభిస్తుందని పేర్కొన్నారు. ఇక కోవీషీల్డ్ వేయించుకున్న వారిలో 0.192 శాతం మందిలో, కొవ్యాక్సిన్ తీసుకున్న వారిలో 0.096 శాతం మందిలో సైడ్‌ఎఫెక్ట్స్ గమనించినట్టు ఆయన తెలిపారు.  అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్‌లో అధికశాతం తలనొప్పి, ఒళ్లునొప్పులు, ర్యాషెస్, జ్వరం, వంటి చిన్న సమస్యలేనని,వీరందరూ పూర్తిగా కొలుకున్నారని మంత్రి సభకు తెలిపారు. 

ఇలా ఉండగా, గత 24 గంటల్లో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదని కేంద్రం ప్రకటించింది. కోవిడ్ కేసుల సంఖ్య రోజువారీగా కూడా క్రమంగా తగ్గుతోందని, గత ఐదు వారాల్లో రోజు వారీ మరణాలు కూడా 55 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

 ‘‘కోవిడ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. ఇది శుభసూచకం. గత 24 గంటల్లో ఒక్క కోవిడ్ కేసు కూడా ఢిల్లీలో నమోదు కాలేదు. అందుకే ఇది చాలా గుడ్ న్యూస్.’’ అని నీతిఆయోగ్ అధికారి వీకే పాల్ అన్నారు.