ఇక కంపెనీలు వారానికి నాలుగు రోజుల పాటే 

ఓ కొత్త లేబ‌ర్ కోడ్‌ను తీసుకువ‌చ్చే ప‌నిలో ఉంది కేంద్ర కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ‌. ఈ కొత్త కోడ్ ప్ర‌కారం ఇక కంపెనీలు వారానికి నాలుగు రోజుల పాటే ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకునే వీలు క‌లుగుతుంది. అయితే వారానికి మొత్తం ప‌ని గంట‌లు మాత్రం 48గానే ఉండ‌నున్నాయి.

ఈ లెక్క‌న ఒక‌వేళ కంపెనీలు నాలుగు రోజులు ప‌ని, మూడు రోజులు పెయిడ్ లీవ్స్ ఇవ్వాల‌ని అనుకుంటే.. ఆ నాలుగు రోజుల్లో రోజుకు 12 గంట‌ల పాటు ఉద్యోగుల‌తో ప‌ని చేయించుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఉద్యోగుల అనుమ‌తితోనే అని కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి అపూర్వ చంద్ర వెల్ల‌డించారు. 

వారానికి ఎన్ని రోజులు ప‌ని అన్న విష‌యంలో తాము ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌డం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అయితే ఈ కొత్త కోడ్ వ‌ల్ల కంపెనీలు, ఉద్యోగుల‌కు ప‌ని చేసే రోజుల్లో కాస్త వెసులుబాటు క‌లుగుతుంద‌ని అపూర్వ చంద్ర చెప్పారు. ఈ కొత్త కోడ్ ముసాయిదా నిబంధ‌న‌లు చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని, చాలా వ‌రకూ రాష్ట్రాలు కూడా త‌మ సొంత నిబంధ‌న‌లు రూపొందించే ప్ర‌క్రియ‌లో ఉన్నాయ‌ని తెలిపారు. ఈ కొత్త కోడ్ వ‌స్తే ప‌ని రోజులు వారానికి ఐదు కంటే కూడా త‌గ్గ‌వ‌చ్చని చెప్పారు. 4,5,6 అనేది కంపెనీలు, ఉద్యోగులు తీసుకోవాల్సిన నిర్ణ‌య‌మ‌ని అపూర్వ చంద్ర తెలిపారు. 

ఈ ఏడాది జూన్ నాటికి అసంఘ‌టిత రంగ కార్మికులు రిజిస్ట‌ర్ చేసుకోవ‌డానికి, ఇత‌ర ప్ర‌యోజ‌నాల కోసం ఓ వెబ్ పోర్ట‌ల్ ప్రారంభించనుంది. కార్మిక మంత్రిత్వ శాఖ సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వేత‌న కోడ్‌, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిప‌ర‌మైన భ‌ద్ర‌త‌, ఆరోగ్య‌, ప‌ని ప‌రిస్థితులు, సామాజిక భద్ర‌త కోడ్‌ల‌ను తీసుకురానుంద‌ని అపూర్వ చంద్ర చెప్పారు.