పాక్‌ వెళ్లిన వంద మంది కశ్మీరీ యువత గల్లంతు!

వీసాపై పాకిస్తాన్‌కు వెళ్లిన కశ్మీర్‌కు చెందిన దాదాపు 100 మంది యువకులు గత మూడేండ్లలో తప్పిపోయినట్లు భద్రతా సంస్థ తెలిపింది. పాకిస్తాన్‌ పర్యటనపై వెళ్లిన వారెవరూ ఇంతవరకు తిరిగి రాలేదని, అయితే, వారంతా గల్లంతయ్యారు అని ఒక ఐపీఎస్‌ అధికారి చెప్పారు.
ఇదంతా టెర్రర్ సంస్థల ‘స్లీపర్ సెల్స్’లో భాగం కావచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. టెర్రర్‌ సంస్థలు తొలుత యువతను ప్రభావితమయ్యేలా చేసి అనంతరం వారికి శిక్షణ ఇస్తారు. భారత వ్యతిరేక ప్రచారం చేయటానికి చాలా మంది యువత ఆకర్షితులవుతున్నారు. అలాంటి యువతను తిరిగి రప్పించడం మన ముందున్న పెద్ద సవాలు” అని ఆ అధికారి చెప్పారు.
కశ్మీరీ యువకులు స్వల్ప వ్యవధి కోసం చెల్లుబాటయ్యే వీసాలపై పాకిస్తాన్ వెళ్లారు. అయితే, గత మూడు సంవత్సరాలలో అలా వెళ్లిన తిరిగి ఈ గడ్డపైకి రాలేదు. వీరు కనిపించకుండా పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, రెండేండ్ల క్రితం పాకిస్తాన్‌కు వెళ్లిన వారిని పిలిచి ప్రశ్నించారు. అలా పాక్‌కు వెళ్లినవారు తిరిగి ఎందుకు రావడం లేదని అధికారులు వారిని విచారించి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించారు. భారత్‌ నుంచి పాకిస్తాన్‌కు పర్యాటక వీసాపై వెళ్లే వారిని భద్రతా సంస్థలు నిలువరించలేవని, నిఘా మాత్రమే పెట్టగలుగుతామని మరొక అధికారి చెప్పారు. ఇలాంటి యువతను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రోయోక్టివ్‌ ఔట్‌రీచ్‌ ప్రోగ్రామ్‌ తీసుకుని వారి కదలికలను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తున్నది.