మయన్మార్ సైనిక చర్యపై ఐరాసలో ఆగ్రవేశాలు 

మయన్మార్ లో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడం పట్ల ఐక్యరాజ్యసమితిలో ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. సైనిక  చర్యను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి చెందిన ప్రత్యేక రాయబారి క్రిస్టైన్ స్క్రానెర్ బర్జెనెర్ తీవ్రంగా ఖండించారు. నిర్బంధంలో ఉన్న నేతలను తక్షణం విడుదల చేయాలని పిలుపునిచ్చారు. 

మయన్మార్ రాజధాని నేప్యిటాలో డిప్యూటీ కమాండర్ ఇన్ ఛీప్ వైస్ జనరల్ సో విన్‌తో మాట్లాడారని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫనే డుజర్రిక్ వెల్లడించారు. మయన్మార్‌లో కీలక ప్రాంతాల్లో ప్రజలకు భద్రత, రోహింగ్యా శరణార్థులకు స్వచ్ఛంద, సుస్థిర పునరావాస కల్పన తదితర సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని బర్జెనెర్ మిలిటరీ ప్రతినిధికి గట్టిగా చెప్పినట్టు డుజర్రిక్ తెలిపారు. 

ఇద్దరి ప్రతినిధుల మధ్య ముఖ్యమైన చర్చలు సుదీర్ఘంగా కొనసాగాయని, మిలిటరీ ప్రతినిధితో ఐక్యరాజ్యసమితి చర్చించడం ఇది మొదటిసారని పేర్కొన్నారు. మరోవంక, 15 మంది సభ్యులున్న భద్రతామండలి కూడా మయన్మార్ సైనిక  చర్యను తీవ్రంగా ఖండించింది. నిర్బంధంలో ఉన్న వారిని తక్షణం విడుదల చేయాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది.

అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ ప్రతినిధులతోకూడా ఈ సమస్యపై బర్జెనెర్ చర్చిస్తున్నట్టు డుజర్రిక్ చెప్పారు. అందరూ కలసి మయన్మార్‌లో సుస్థిరతకు పాటుపడాలని పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇదే సందర్భంగా భారత్ కూడా అనేక అభిప్రాయాలకు వారధిగా నిర్మాణాత్మకంగా పనిచేస్తోంది. సైనిక చర్యను ఖండించడమే కాక, ప్రజాస్వామ్య ప్రక్రియకు ప్రాముఖ్యతనిస్తోందని ఆయా వర్గాలు తెలిపాయి.

మరోవంక, మయన్మార్‌లో సామాజిక మాధ్యమాలపై మరింత నిషేధం పెరిగింది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లపై కూడా సైనిక  ప్రభుత్వం నిషేధం విధించింది. ఫేస్‌బుక్‌తోపాటు కొంతమంది బూటకపు సమాచారాన్ని వ్యాపింప చేయడానికి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లను వినియోగిస్తున్నందున వీటికి కూడా అడ్డుకట్ట వేయాలని కమ్యూనికేషన్ ఆపరేటర్లను, ఇంటెర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను మిలిటరీ ప్రభుత్వం ఆదేశించింది. 

మయన్మార్‌లో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న నార్వే కేంద్రమైన టెలికమ్యూనికేషన్స్ కంపెనీ తాము ఆదేశాలకు కట్టుబడి ఉన్నప్పటికీ ఆ ఆదేశాలు తప్పనిసరి, విచక్షణపై సవాలు చేస్తున్నామని చెప్పింది.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ శుక్రవారం న్యూయార్క్‌లో మాట్లాడుతూ మయన్మార్‌లో యథాతధ పరిస్థితి నెలకొనడానికి సమితి కృషి చేస్తుందని తెలిపారు. నవంబర్ ఎన్నికల ఫలితాలను గౌరవించి నిర్బంధంలో ఉన్న ప్రజా ప్రతినిధులందర్నీ మిలిటరీ విడిచిపెట్టాలని సూచించారు. అరెస్టులో ఉన్న 134 మంది అధికారులు, చట్టసభ సభ్యులతోపాటు మరో 18 మంది ఉద్యమనేతలు కూడా మయన్మార్‌లో అరెస్టు అయ్యారని మయన్మార్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ ప్రకటించింది.