విశ్వ పౌరసత్వ రాయబారిగా శ్రీ శ్రీ రవిశంకర్

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్‌కు బోస్టన్ (అమెరికా) రాష్ట్రంలోని ప్రముఖ నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం విశ్వ పౌరసత్వ రాయబారిగా విశేషమైన గుర్తింపును ఇచ్చింది. ప్రపంచ శాంతి యత్నాలు, మానవతావాద, ఆధ్యాత్మిక నాయకత్వ పటిమతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతవిశ్వాసాల మధ్య సామరస్యం కోసం ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. 

ఈ సంద‌ర్భంగా విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక సలహాదారు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అలెగ్జాండర్ లివరింగ్ కెర్న్ స్పందిస్తూ విశ్వమానవ రాయబారిగా గుర్తింపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు, మొట్టమొదటగా శ్రీశ్రీ కంటే ఉత్తమమైన వ్యక్తిని తాము ఊహించలేకపోయామన్నారు. ఎల్లప్పుడూ ఆనందంగా కనిపించే మానవతావాది.

అత్యుత్తమమైన మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచే శ్రీశ్రీతో చర్చాకార్యక్రమం ద్వారా వారినుండి జ్ఞానాన్ని పొందడంతో ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించినందుకు త‌మ‌కు చాలా ఆనందంగా ఉందని ‌తెలిపారు. బోస్టన్ తదితర ప్రాంతాలకు చెందిన సర్వమత సమ్మేళనాల తరపున, ప్రజలను విశ్వపౌరులుగా తీర్చిదిద్దేందుకు, మరింత ధర్మబద్ధమైన, శాంతియుతమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని ప్రజలకు అందించటానికి తాము కృషి చేస్తామన పేర్కొన్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, సంస్థలు, జాతుల మధ్య పరస్పర శాంతిని పెంపొందించేందుకు, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు గురుదేవ్ అవిశ్రాంతంగా పాటుపడుతున్న‌ట్లు చెప్పారు. సంఘర్షణల నివారణకు, మానసిక ఆందోళన నివారణకు కృషి చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.