పాత కార్లను తుక్కు చేస్తే కొత్తవాటిపై రాయితీలు 

20 ఏళ్ళు దాటినా పాత కార్లను తుక్కు చేయవలసిందే అంటూ వార్షిక బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రతిపాదన అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.  పాతకార్లను తుక్కు చేసేవారికి కొత్త కార్ల కొనుగోళ్లలో పలు రాయితీలు కల్పించేందుకు చూస్తున్నారు. 

పాత వాహనాల‌ను రోడ్ల‌పై నుంచి తొల‌గించ‌డానికి కేంద్రం మ‌రిన్ని చ‌ర్య‌లు కూడా తీసుకుంటోంది. 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహ‌నాలు, 15 ఏళ్లు దాటిన వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌పై గ్రీన్ ట్యాక్స్ కూడా విధిస్తామ‌ని చెప్పింది. తాజాగా ఈ కొత్త పాల‌సీ ప్ర‌కారం.. పాత కారును తుక్కు చేస్తే కొత్త కారుపై అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామ‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ వెల్ల‌డించారు. ఈ పాల‌సీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌రలోనే ప్ర‌జ‌ల ముందుకు తీసుకొస్తామ‌ని ఆయన చెప్పారు.

ఈ కొత్త తుక్కు పాల‌సీ దేశంలోని ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీకి బూస్ట్‌లా ప‌ని చేస్తుంద‌ని గ‌డ్క‌రీ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం రూ.4.5 ల‌క్ష‌ల కోట్లుగా ఉన్న ఈ ఇండ‌స్ట్రీ ట‌ర్నోవ‌ర్  రానున్న ఏళ్ల‌లో రూ.10 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరుగుతుంద‌ని ఆయ‌న చెప్పారు.  మరోవంక, రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి గిరిధ‌ర్ అర‌మానె కూడా పాత వాహనాన్ని తుక్కు చేస్తే కొత్త‌దానిపై అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు ఉండ‌నున్న‌ట్లు తెలిపారు. తాము కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు.

ఈ పాల‌సీ త‌ప్ప‌నిస‌రి అని, అన్ని పాత వాహ‌నాలు మ‌నుషుల ప్ర‌మేయం లేకుండా ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టులు ఎదుర్కోవాల్సిందేనని స్ప‌ష్టం చేశారు. దేశ‌వ్యాప్తంగా పీపీపీ ప‌ద్ధ‌తిలో ఫిట్‌నెస్ టెస్టుల కేంద్రాల‌ను, తుక్కు కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.