వ్యవసాయంకు 43 శాతం అధికంగా కేటాయింపులు 

వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ఇస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. యూపీఏ పరిపాలనలో ఈ రంగానికి కేటాయించిన బడ్జెట్ నిధుల కన్నా 43 శాతం అధికంగా, అంటే నాలుగు రెట్లకన్నా ఎక్కువగా మోదీ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 

ఈ రంగంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను వామపక్షాలు, టుకడే-టుకడే గ్యాంగ్ అపఖ్యాతిపాలు చేస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయ రంగం కోసం బడ్జెట్ కేటాయింపుల గురించి స్పష్టంగా వివరించాలనుకుంటున్నానని చెప్పారు. 

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పరిపాలించిన 2009 నుంచి 2014 మధ్య కాలంలో వ్యవసాయ రంగానికి రూ.88,811 కోట్లు కేటాయించిందని చెప్పారు. మోదీ ప్రభుత్వం పరిపాలిస్తున్న 2014 నుంచి 2020 మధ్య కాలంలో ఈ రంగానికి రూ.4,87,238 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంటే యూపీఏ కన్నా మోదీ హయాంలో ఈ రంగానికి కేటాయింపులు 438 శాతం పెరిగాయని వివరించారు. 

2013-14లో రూ.7 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇచ్చారని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.16.5 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2013-14లో రూ.33 వేల కోట్ల విలువైన గోధుమలను సేకరించారని, ఇది 2019-20లో రూ.62 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు.  

2013-14లో రూ.63,298 కోట్ల విలువైన వరిని సేకరించారని, 2019-20లో ఇది రూ.1.41 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రైతులకు సంవత్సరానికి రూ.6,000 చొప్పున మోదీ ప్రభుత్వం చెల్లిస్తోందని, దీనివల్ల 1 కోటి 6 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వివరించారు.