దేశం పరువు తీయడానికే రైతుల ఉద్యమం హైజాక్!

భారత దేశం పరువు తీయడానికి భారీ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ తాజాగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమాన్ని కూడా వీరు హైజాక్ చేశారని  కేంద్ర మంత్రి, బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ధ్వజమెత్తారు.  
 
ప్రజలు తిరస్కరించిన రాజకీయ నాయకులు, దేశాన్ని యథేచ్ఛగా విమర్శించేవారు ఈ కుట్రను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతు ఉద్యమంతో వీరు దీంతో రాజకీయాలు చేస్తున్నారని పేర్కొంటూ దేశంలో కొందరికి ఇప్పటికీ భూస్వామ్య దురహంకారం ఉందని ఆరోపించారు. కొందరు స్వార్థపరుల నేరపూరిత కుట్రలను, రాజకీయ నయవంచనలను ప్రజలు తిప్పికొడుతున్నారని స్పష్టం చేశారు. ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
 
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే క్రిమినల్ సిండికేట్‌ను, భారత దేశంపై చెడు విమర్శలు చేసేవారిని ప్రజల నిబద్ధత నిరంతరం ఓడిస్తోందని భరోసా వ్యక్తం చేశారు. 
 
ఇలాంటి వారంతా కలిసి దేశంలో అసహనం ఉందంటూ గొడవ చేశారని, పాకిస్థాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ మీద ప్రశ్నలు లేవనెత్తారని, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై గందరగోళం సృష్టించారని ఆరోపించారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను కూడా వీరు వ్యతిరేకిస్తున్నారన్నారు.
 
భారత దేశంపై చెడు విమర్శలు చేసేవారు తప్పుడు, బూటకపు ప్రచారం చేస్తున్నారని దయ్యబట్టారు. దేశంలోని మైనారిటీలకు భద్రత లేదని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మైనారిటీలతో సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిలో మైనారిటీలతోపాటు అందరినీ సమానంగా భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు.