కేరళ మాజీ డీజీపీ జాకబ్  బీజేపీలో చేరిక

కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర మాజీ పోలీసు డైరెక్టరు జనరల్ జాకబ్ థామస్ భారతీయ జనతాపార్టీలో చేరారు. కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని మాజీ డీజీపీ జాకబ్ థామస్ ఆరోపించారు.
 
తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నందున బీజేపీలో చేరానని జాకబ్ చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా  టెక్కిన్ కడ్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాజీ డీజీపీ జాకబ్‌కు బీజేపీ సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు బీజేపీ అధినేత జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన కోసం కొచ్చికి వచ్చారు. 
 
పార్టీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా కేరళలో పర్యటించిన నడ్డాకు అపూర్వ స్వాగతం లభించింది. కొచ్చి విమానాశ్రయం నుంచి నడ్డా ఒపెన్ టాప్ జీపులో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వెంటరాగా త్రిస్సూర్ కు వచ్చారు. వామపక్ష కూటమి పాలనలో కేరళలో అభివృద్ధి మందగించిందని,  ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయినదని నడ్డా విమర్శించారు.
కేరళ రాష్ట్రం అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతూ తాజా బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ లోటు పూడ్చడం కోసం రూ 19,000 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్ ల కోసం కేద్రం రూ 50,000 కోట్లు కేటాయించిందని వివరించారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపిస్తూ కరోనాను కట్టడి చేయడంలో ఆరోగ్యమంత్రి కేకే శైలజ విఫలం అయ్యారని ధ్వజమెత్తారు.
జాకబ్ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరింప చేసుకున్నదని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ చెప్పారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన కూటములు పాలనలో, అభివృద్ధిలో విఫలం కావడంతో ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారని తెలిపారు.  140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో మాజీ డీజీపీ బీజేపీ తీర్థం స్వీకరించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.