సాగు చట్టాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం

సాగు చట్టాలపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు ప్రతిపక్షాలు, అటు రైతు సంఘాలు.. సాగు చట్టాల్లో ఒక్క లోపాన్ని కూడా ఎత్తి చూపలేకపోయాయని ధ్వజమెత్తారు. 

శుక్రవారం రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడూ అలా చేయదని స్పష్టం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొందరు రైతులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.

‘‘నీటి ఆధారంగానే వ్యవసాయం నడస్తుందని అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ మాత్రం వ్యవసాయాన్ని రక్తంతో చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకూ చట్టాల్లో ఉన్న లోపాన్ని ఎత్తిచూపడంలో ప్రతిపక్షాలన్నీ విఫలమయ్యాయి.’’ అని తోమర్ మండిపడ్డారు.  తామేమీ పంతాలకు పోవడం లేదని, చట్టాల్లో ఉన్న లోపాలను మాత్రమే ఎత్తిచూపాలని డిమాండ్ చేస్తున్నామని, అయినా సరే ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని తెలిపారు.

చట్టాల్లో సవరణలు చేసేందుకూ సిద్ధమేనని చెబుతూ  అలాగని ఆ మూడు చట్టాల్లో లోపాలున్నట్టు కాదని పేర్కొన్నారు. నూతన సాగు చట్టాలు కచ్చితంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాయని, రైతు సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తోమర్ పునరుద్ఘాటించారు. కేవలం ఒక రాష్ట్రానికి చెందిన రైతులే ఆందోళనలు చేస్తున్నారనిఎం  వారికి కావాలనే తప్పుడు సమాచారమిచ్చి రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లు రైతుల భూములను లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. 

ఈ చట్టాలను నల్ల చట్టాలు అని అభివర్ణించినందుకు  మండిపడ్డారు. ఈ చట్టాలు నల్ల చట్టాలు ఎలా అయ్యాయో చెప్పాలని రైతు సంఘాలను తాను కోరుతున్నానని సవాల్ చేశారు. కానీ ఎవరూ తనకు వివరంగా చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే రైతుల భూములను ఇతరులు ఆక్రమించుకుంటారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. 

ఒప్పంద వ్యవసాయంలో రైతు భూమిని లాక్కునేలా చట్టంలో ఎక్కడైనా నిబంధనలున్నాయేమో చూపించాలని సవాల్ విసిరారు. చట్టాలతో రైతులకు లాభం తప్ప ఎలాంటి నష్టం జరగదని మంత్రి హామీ ఇచ్చారు.  వ్యవసాయ రంగానికి అవసరమైన పెట్టుబడులు సమకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి  తోమర్ చెప్పారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి క్రింద రూ.1 లక్ష కోట్లు స్వయం సమృద్ధ భారత్ పథకంలో భాగంగా కేటాయించినట్లు తెలిపారు. 

నీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ఉత్పాదక వ్యయం కన్నా 50 శాతం ఎక్కువ ఇస్తున్నామని చెబుతూ  ఉత్పాదక వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగా ఎంఎస్‌పీని ఇవ్వడం ప్రారంభించామని పేర్కొన్నారు. రైతులకు అనుకూలమైన ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని తెలిపారు. 

 గ్రామ పంచాయతీలకు రూ.2.36 లక్షల కోట్లు అందజేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, ఈ సిఫారసును కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ రంగానికి రూ.43 వేల కోట్లు మంజూరు చేసినట్లు  గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల ద్వారా ఐదేళ్లలో రూ.2.8 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. 

గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నిధులను తమ ప్రభుత్వం పెంచుతూ పోతోందని చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి మన దేశాన్ని కుదిపేసిన సమయంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయింపులను రూ.61 వేల కోట్ల నుంచి రూ.1,11,500 కోట్లకు పెంచినట్లు తెలిపారు. 10 కోట్ల మందికి పైగా దీనివల్ల ఉపాధి పొందినట్లు తెలిపారు.