తమిళనాడులో సహకార రుణాల మాఫీ 

అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు తమిళనాడు ప్రభుత్వం పెద్ద కానుక ప్రకటించింది. సహకార బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న 12,110 కోట్ల రైతు రుణాల‌ను మాఫీ చేయ‌నున్న‌ట్లు ముఖ్యమంత్రి ప‌ళ‌నిస్వామి ప్రకటించారు. దీంతో 16.43లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 
 
శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ ప‌ళ‌నిస్వామి ఈవిష‌యాన్ని వెల్లడించారు. రైతులు మ‌ళ్లీ వ్య‌వ‌సాయం చేయాలంటే ఈ చ‌ర్య చాలా అవసరమని సిఎం పేర్కొన్నారు. క‌రోనా విజృంభణ వేళ రైతుల‌కు పంట నష్టం జ‌రిగింద‌ని ఆయన తెలిపారు. వ‌రుస‌గా రెండు తుఫాన్లు, అకాల వ‌ర్షాలు భారీ పంట న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. 
 
త‌క్ష‌ణ‌మే రుణ‌మాఫీ పథకాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇంతకుముందు ప్రకటించినట్లు అందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని, తమిళనాడులో కరోనా వైరస్ లేకుండా చేస్తామని సిఎం పళనిస్వామి రాష్ట్ర శాసనసభలో పేర్కొన్నారు.