భారత్ అభివృద్ధి చేస్తున్న కొత్త డ్రోన్ శత్రుదేశాలకు సవాల్ విసరనున్నది. బాగా ఎత్తున ఎగిరే అత్యాధునిక దేశీయ డ్రోన్ ‘ఇన్ఫినిటీ’ మరో ఐదేండ్లలోపు సైనిక దళాలకు అందుబాటులోకి రానున్నది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ న్యూస్పేస్ భాగస్వామ్యంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఈ అత్యాధునిక డ్రోన్‌ను అభివృద్ధి చేస్తున్నది.
సౌరశక్తితో పనిచేసే ఈ డ్రోన్ ఏకధీటుగా తొంభై రోజుల పాటు 65,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. భారతదేశ మానవరహిత డ్రోన్ వార్ఫేర్ ప్రోగ్రామ్, కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (క్యాట్స్)లో ఇది కీలకం కానున్నది.
ఆకాశంలోని స్ట్రాటో ఆవరణలో భవిష్యత్ యుద్ధ అవసరాల కోసం ఈ డ్రోన్‌ను రూపొందిస్తున్నట్లు హాల్ అధికారులు తెలిపారు. అత్యాధునిక సింథటిక్ ఎపర్చర్ రాడార్‌తో సహా పలు రకాల సెన్సార్లతో కూడిన ‘ఇన్ఫినిటీ’ డ్రోన్ శత్రు భూభాగంలోని లక్ష్యాలను లోతుగా ట్రాక్ చేస్తుందని పేర్కొన్నారు.
‘లాయల్ వింగ్‌మాన్’ వారియర్ వంటి ఇతర భారతీయ డ్రోన్ వ్యవస్థలు, స్వదేశీ పోరాట ఎయిర్ టీమింగ్ వ్యవస్థలో భాగమైన ఆల్ఫా-ఎస్ సమూహ డ్రోన్లు లేదా హంటర్ క్రూయిజ్ క్షిపణులు నిర్వహించే దాడి మిషన్లను ఇది సమన్వయం చేస్తుందని, దాడి డ్రోన్ల సమాచారాన్ని గ్రౌండ్‌లోని పర్యవేక్షణ స్టేషన్లకు ప్రత్యక్ష వీడియో ఫీడ్‌ను కూడా ప్రసారం చేయగలదని, మానవరహిత డ్రోన్ దాడులను కళ్లకు కడుతుందని వెల్లడించారు.
2019లో పాకిస్థాన్‌లోని బాలకోట్‌లో ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వైమానిక దళం దాడి సందర్భంగా ఇలాంటి ప్రత్యక్ష వీడియో ప్రసారం లేకపోవడం వల్ల ఆ మిషన్ విజయంపై అనేక ప్రశ్నలు కలిగాయని, భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలకు ఇది సమాధానం చెబుతుందని హాల్ అధికారులు తెలిపారు.
ఇన్ఫినిటీ డ్రోన్ సైనిక కార్యకలాపాలకు మాత్రమే కాకుండా అందులోని ఇన్ఫ్రారెడ్, ఇమేజింగ్ పేలోడ్ వంటి పరికరాలు విపత్తు నిర్వహణ, స్మార్ట్ సిటీల రూపకల్పన, సహజ వనరుల నిర్వహణ వంటి సేవలకు ఉపయోగపడతాయని చెప్పారు. అంతేగాక దేశీయ తీర జలమార్గాలను పర్యవేక్షించడానికి, విపత్తు కార్యకలాపాల నిర్వహణ కోసం హోమ్, షిప్పింగ్ మంత్రిత్వ శాఖలు కూడా ఈ డ్రోన్ సేవలు వినియోగించుకుంటాయని వివరించారు.
More Stories
శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారులు 90 కోట్లు
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!