భారత్ కు యావత్తు గగనతలంపై నిఘా పెట్టే సామర్థ్యం

నేడు మన యావత్తు గగనతలంపై నిఘా పెట్టే సామర్థ్యం మనకు ఉందని, దీనిని మనం స్వయంకృషితో దేశీయంగా సాధించామని భారత వాయు సేన (ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బడౌరియా తెలిపారు. 

బెంగళూరులో ఏరో ఇండియా, 2021లో మాట్లాడుతూ అంతర్జాతీయ గగనతల సేవల రంగంలో భారత దేశం రాబోయే దశాబ్దంలో అత్యంత ప్రధాన భూమికను పోషించబోతోందని చెప్పారు. భౌగోళిక రాజకీయాల వ్యూహం నుంచి క్షుణ్ణంగా పరిశీలించినపుడు ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతకు భారత దేశం కేంద్రంగా నిలవబోతున్నట్లు తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల సమయాల్లో  సహాయం కోసం మన మిత్రులు, భాగస్వాముల నుంచి వచ్చే పిలుపులకు స్పందించడంలో భారత దేశం, వాయు సేన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో మానవీయ సహాయం, విపత్తు సహాయ కార్యక్రమాల్లో ఐఏఎఫ్ ముందు వరుసలో పాల్గొంటోందని తెలిపారు. 

స్వదేశీ సామర్థ్యాన్ని పటిష్టపరచుకోవడం కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలను, విధానాల్లో మార్పులను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్‌ను ఆవిష్కరించడంలో పాలుపంచుకునేవిధంగా భాగస్వాములను ప్రోత్సహిస్తోందని చెప్పారు.

ఏరో ఇండియా ఈవెంట్ మూడు రోజులపాటు జరుగుతుంది. బుధవారం ప్రారంభమైన ఈ ఈవెంట్ ఆసియాలో అతి పెద్ద మిలిటరీ ఏవియేషన్ ఎగ్జిబిషన్‌ అని చెప్తున్నారు. స్వయం సమృద్ధ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిని నిర్వహిస్తున్నారు.