దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ని తయారు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. జనాభా లెక్కల కోసం సేకరించే వ్యక్తిగత స్థాయి సమాచారమంతా గోప్యంగా ఉంటుందని పేర్కొంది.
నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్), జనాభా లెక్కల సేకరణలపై వ్యక్తమవుతున్న భయాలకు సంబంధించి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా సేకరించే వ్యక్తిగత సమాచారమంతా గోప్యంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
సెన్సస్‌లో కేవలం వివిధ పరిపాలనా స్థాయుల్లో సాధారణ సమాచారాన్ని మాత్రమే విడుదల చేస్తామని పేర్కొంది. 2021 జనాభా లెక్కల సేకరణ విజయవంతంగా పూర్తయ్యే విధంగా గతంలో మాదిరిగానే విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపింది. ప్రజలకు సరైన అవగాహన కలిగే విధంగా ప్రచారం చేస్తామని తెలిపింది.జనాభా లెక్కల సేకరణతోపాటు ఎన్‌పీఆర్ ప్రశ్నావళులను విజయవంతంగా దేశవ్యాప్తంగా పరీక్షించినట్లు పేర్కొంది. భారత ప్రజల జాతీయ రిజిస్టర్ తయారీ గురించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వంలోని అనేక స్థాయుల్లో స్పష్టీకరించినట్లు వివరించింది.
ఎన్‌పీఆర్, సెన్సస్‌లపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది ఫిబ్రవరిలో పేర్కొంది. దీనిపై తీసుకున్న చర్యల నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఎన్‌పీఆర్‌పై స్పష్టమైన, సరైన సందేశాన్ని ప్రజలకు అందజేసేందుకు 360 డిగ్రీల విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాలు, ఏవీ, డిజిటల్, ఔట్‌డోర్, ప్రింట్, నోటి మాటలు వంటివాటి ద్వారా ప్రచారం చేస్తామని పేర్కొంది.
ఎన్‌పీఆర్, జనాభా లెక్కలు, 2021లపై తప్పుడు సమాచారాన్ని, వదంతులను ఎదుర్కొనేందుకు సరైన రీతిలో సందేశాలను ప్రజలకు అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జనాభా లెక్కలు-2021 మొదటి దశను, ఎన్‌పీఆర్ నవీకరణను, సంబంధిత ఇతర క్షేత్ర స్థాయి కార్యకలాపాలను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వాయిదా వేసినట్లు తెలిపింది.
More Stories
జమిలి ఎన్నికలకు పట్టుదలతో మోదీ ప్రభుత్వం
వైద్యులందరికీ ప్రత్యేక ఐడీలు
హిందూ వివాహం అంటే ఒక కాంట్రాక్ట్ కాదు